ప్రపంచవ్యాప్తంగా 30 సంవత్సరాల్లోపు యువత (జెన్ జెడ్) మెచ్చిన నగరాల్లో బ్యాంకాక్ (థాయ్‌లాండ్) అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా అందుబాటు ధరలు, సంస్కృతి, రాత్రివేళల్లో వినోదభరిత జీవనం, నాణ్యమైన జీవితం- ఈ నాలుగు అంశాలకు వాళ్లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ సర్వే తెలిపింది. ప్రస్తుత సంవత్సరానికి గాను టైమ్ అవుట్ ఈ సర్వేను నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 18,500 మంది ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో రెండో ఉత్తమ నగరంగా మెల్‌బోర్న్‌కు ఎక్కువ మంది ఓటేశారు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ నగరంలో అందరికీ సమాన అవకాశాలతో కూడిన పరిస్థితులు, సంస్కృతి విధానాలు తమకు నచ్చాయని యువత వెల్లడించినట్లు సర్వే తెలిపింది. మూడో స్థానంలో నిలిచిన కేప్‌టౌన్‌లో ప్రకృతి సౌందర్యం, రాత్రిపూట వినోధభరిత జీవనం వంటి అనుకూలతలు ఉన్నట్లు వారు చెప్పారని పేర్కొంది.
