ఏపీ స్టేట్ బ్యూరో,
ప్రధాని నరేంద్ర మోది 2015లో అమరావతి శంకుస్ధాపనకు మరచెంబుతో మట్టి తీసుకు వచ్చారని, ఇప్పడు ఏపీ ప్రజల మొఖాన సున్నం కొట్టారని పీసీసీ చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి విమర్శించారు. శనివారం ఆమె శుక్రవారం నాటి అమరావతి పర్యటనపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోడి తీరు చూస్తుంటే చిచ్చుబుడ్డి తుస్సు మంది అనక తప్పదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే బాధ్యతని పేర్కొన్నారు. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలను కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. విభజన చట్టం కేంద్రం చేయాల్సిన విధులను స్పష్టంగా చెబుతుంటే, ప్రధాని మోదీ గారు మనకు ఏమిచ్చారని ప్రశ్నించారు. ఆనాడు 2015లో మట్టి కొట్టారు. నేడు సున్నం కొట్టి వెళ్ళారని విమర్శించారు. 10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో, నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారన్నారు. మళ్ళీ “అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం” అంటూ బూటకపు మాటలు చెప్పారన్నారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్ని చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారని, అన్ని ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదని సందేహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా ? రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా ? కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నామని చెప్పారా? – పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా ? అని ప్రశ్నలు సంధించారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. మోడీని నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతున్నట్లు సీఎం తెలుసుకోవాలని కోరారు. ఏదో ఉద్ధరిస్తారని, కాసులు కురిపిస్తారని నమ్మి, ఒకసారి రాత్రి గోతిలో పడ్డ చంద్రబాబు, మళ్ళీ మోడీని పిలిచి అదే గోతిలో పగలు పడ్డారని అపహాస్యం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ పక్షాన తాను అడిగిన ప్రశ్నిలకు సమాధానం ఇవ్వాలన్నారు. రాజధానికి కావాల్సింది అప్పులు కాదు..నిధులు, రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అప్పు పుట్టనిదే జీతాలకు దిక్కులేదని చెప్పే మీరు రాజధాని నిర్మాణానికి ఎవరిని అడిగి రూ.60 వేల కోట్లు అప్పు తెస్తున్నారు ? అని ప్రశ్నించారు. తీసుకున్న వడ్డీల భారాన్ని మోసేదెలా? అని షర్మిలా ఫ్రశ్నించారు. వరల్డ్ బ్యాంక్, ఎడిబి, కె?ఎఫ్.డబ్య్లు, హడ్కోల దగ్గర రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు ? అని ప్రశ్నించారు. – ప్రభుత్వ భూములు అంటే ప్రజల ఆస్తి వాటిని అమ్మి రాజధాని ఎలా కడతారు ? కేంద్రం మెడలు వంచే దమ్ములేక, భావితరాల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరారు.
—-
