అల్లు అర్జున్‌ని ‘పుష్ప’ సినిమాలు ఐకాన్ స్టార్‌ని చేసేశాయి. అంతకుముందు ఆయన్ని స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు. అందుకు తగ్గట్టే ప్రతి సినిమాకీ ఓ కొత్త రకమైన స్టైల్‌తో దర్శనమిచ్చేవారు. ‘పుష్ప’ పాత్ర కారణంగా దాదాపు ఐదేళ్లపాటు గుబురు గడ్డం, జుట్టుతోనే కనిపించాల్సి వచ్చింది. ఆ పాత్ర నుంచి బయటికి వచ్చాక మళ్లీ అల్లు అర్జున్ మునుపటిలా స్టైల్‌గా మారిపోయారు. కొత్త సినిమాలో ఎలాంటి లుక్‌లో కనిపిస్తారో ఇంకా స్పష్టత లేదు. చిత్రీకరణ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉంది. ఒక దఫా లుక్ టెస్ట్ అయితే జరిగింది. ఇంకా తుది నిర్ణయానికైతే రాలేదని సమాచారం. అయితే అల్లు అర్జున్ మాత్రం బయట కొత్త రకమైన స్టైల్‌తో కనిపిస్తూ ఊరిస్తున్నారు. వేవ్స్ సమ్మిట్‌లో ఆయన లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన తదుపరి చిత్రం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో భిన్నరకాల లుక్స్‌లో ఆయన సందడి చేస్తారని తెలుస్తోంది.
