కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) త్వరలో తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన నటిస్తున్న ఈ 22వ సినిమాకి అట్లీ (Atlee) దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో కథ రీత్యా ముగ్గురు కథానాయికలు కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, అందులో ఓ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను (Mrunal Thakur) రంగంలోకి దించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆమెతో కథా చర్చలు పూర్తయ్యాయని.. ఇటీవలే తను లుక్ టెస్ట్‌లోనూ పాల్గొందని తెలుస్తోంది. మరోవైపు మిగిలిన రెండు నాయికా పాత్రల కోసం జాన్వీ కపూర్, దీపికా పదుకొణె (Deepika Padukone) పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే జాన్వీతో చర్చలు పూర్తయ్యాయని.. దీపికతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న కథతో రూపొందుతున్న చిత్రమిది. సమాంతర ప్రపంచం, పునర్జన్మ కాన్సెప్ట్ ఈ కథలో మిళితమై ఉండనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇది ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.
