ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో పాకిస్థాన్‌కు భారీ నష్టం కలిగించామని, ఆ దేశ అత్యాధునిక యుద్ధ విమానాలను నేలకూల్చామని భారత సైన్యం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా పాకిస్థాన్ ఆర్మీ (Pakistan Army) స్పందించింది. తమ ఫైటర్ జెట్ ఒకటి ధ్వంసమైన మాట వాస్తవమేనని అంగీకరించింది. అయితే, అది స్వల్పమేనని పేర్కొనడం గమనార్హం.
పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ.. తమ దేశ ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణల్లో మన వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైంది’’ అని వెల్లడించారు. అయితే, ఆ నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలను ఆయన బయటపెట్టలేదు.
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సాధించిన విజయాలను మన సైన్యం ఆదివారం వెల్లడించింది. పాక్ విమానాలను నేల కూల్చామని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి తెలిపారు. అయితే, ఆ సంఖ్య ఎంత అన్నది ఆయన చెప్పలేదు. ‘‘మన సరిహద్దు లోపలికి పాక్ యుద్ధవిమానాలను రాకుండా నిరోధించాం. కాబట్టి వాటి శకలాలు మా దగ్గర లేవు. కాకపోతే కచ్చితంగా కొన్ని విమానాలను కూల్చాం’’ అని తెలిపారు.
