బయటకువెళ్లి వేచి చూసే పని లేకపోవడం, ఊరించే ఆఫర్లు.. ఇవన్నీ కలిసి ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది (Online Shopping in India). అయితే అమెరికా, చైనాతో పోల్చుకుంటే ఈ విషయంలో భారత్ నాలుగు అడుగులు వెనకే ఉంది. భారత్‌లో 850 మిలియన్ల (85 కోట్లు) మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నప్పటికీ వారిలో 20-25 శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తున్నారని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెకెన్సీ వెల్లడించింది. రానున్న రోజుల్లో భారత ఈ కామర్స్ రంగం గణనీయమైన వృద్ధి సాధించడానికి అవకాశం ఉందని పేర్కొంది.
అమెరికా, చైనాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల్లో 85 శాతం మంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారని పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించింది (Ecommerce In India). భారతీయులు ఈతరహా షాపింగ్ వైపు మొగ్గుచూపడమే గాకుండా కొత్త ఆలోచనలతో ఈ కామర్స్ రంగం వృద్ధికి దోహదం చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలో వస్తువులను ఇంటికి తెచ్చిచ్చే క్విక్ కామర్స్ వేదికలు అందుకు నిదర్శనమని తెలిపింది. కాగా.. 2023 నాటికి దేశ రిటైల్ అమ్మకాల్లో ఈ కామర్స్ వాటా 7 నుంచి 9 శాతంగా ఉండగా.. అది 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనాలు ఉన్నాయి.
