ఏపీ ఎనాలసిస్ ప్రతినిధి:
లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయి. 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి చేరుతాయి. లోక్‌సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీయే సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.
కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్‌తోనూ షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లోక్‌సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుచేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తిచేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం.
2023 సెప్టెంబరులో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రావాలి. రాజ్యాంగ అధికరణలు 170(3), 81(3) ప్రకారం.. 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిబంధన ఉంది. అందువల్ల కేంద్రం మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తేనుంది ఇదివరకు భావించారు. ఇప్పుడు జనగణన 2027 మార్చి 1కల్లా పూర్తికానుండటంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి.. ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపటొచ్చు. ఈ అంశంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలినుంచి దక్షిణాది రాజకీయపార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించడానికి రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మంగళవారం విపక్షనేతలు సమావేశం కానున్నారు.
