శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ఎస్‌బీఐ బ్యాంకులో ఆదివారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. లాకర్‌లో ఉంచిన రూ.38 లక్షల నగదు, 10 కేజీల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. డీఎస్పీ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురం గ్రామీణ మండలం తూముకుంట పారిశ్రామికవాడలోని ఎస్‌బీఐకి వెనుక వైపునున్న కిటికీని దుండగులు కట్టర్‌తో కోసి బ్యాంకులోకి చొరబడ్డారు. వెంటనే సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. లాకర్ గదికి వేసిన తాళాలను కట్టర్‌తో కోసి అందులోని రూ.38 లక్షల నగదుతో పాటు మూడు ట్రేలల్లో ఉంచిన 10 కేజీల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం బ్యాంకు అధికారులు దోపిడీ జరిగినట్లు గుర్తించారు. డీఎస్పీ మహేశ్, సీఐ అబ్దుల్‌కరీం ఘటనా స్థలికి వచ్చి ఆధారాలు సేకరించారు. కాగా, బ్యాంకుకు నాలుగేళ్ల నుంచి సెక్యూరిటీ గార్డ్ లేరని, దీనిపై బ్యాంకు వారిని తాము ముందే హెచ్చరించినా ఏర్పాటు చేయలేదని డీఎస్పీ చెప్పారు.
