గృహ, వాణిజ్య సంస్థలు ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగంలో 6 శాతం ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) తెలిపింది. దీనివల్ల ఏడాదికి సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, ఫలితంగా రూ.10 వేల కోట్లు మిగిల్చినట్లు అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల దగ్గర ఏసీలను వినియోగిస్తున్నారు. హోటళ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, వాణిజ్య ప్రదేశాల్లో ఏసీలను వినియోగించేప్పుడు 24 డిగ్రీలు పెడితే కర్బన ఉద్ఘారాల విడుదల తగ్గుతుంది. ఏసీల జీవితకాలమూ పెరుగుతుంది. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించాం’ అని బీఈఈ పేర్కొంది.
