ఈ పంద్రాగస్టుకు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలు ‘కూలీ’ (Coolie), ‘వార్2’ (War2). ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ కాగా, టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా? అన్న అభిమానుల ఎదురు చూపులకు తెరపడింది. మంగళవారం సాయంత్రం నుంచి టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. బుక్‌మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదు. సింగిల్ స్క్రీన్‌లలో రూ.175కు, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు లభిస్తున్నాయి. మార్నింగ్ షో కన్నా ముందు కేవలం ఒక్క షోకు మాత్రమే అనుమతి లభించినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా థియేటర్‌లకు అనుమతి ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్ షోను ప్రదర్శించనున్నారు. రెండు సినిమాలకు భారీగా డిమాండ్ ఉండటంతో స్పెషల్ షోలకు థియేటర్లు కేటాయించే విషయంలో చాలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
