దేశంలోని 7 ప్రధాన నగరాల్లో వచ్చే ఏడాది చివరికి 1.66 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త షాపింగ్ మాల్స్ ఏర్పాటవుతాయని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ విశ్లేషించింది. గ్రేడ్ ఏ విభాగంలో ఈ షాపింగ్ మాల్స్ రానున్నాయని తెలిపింది. ఇందులో హైదరాబాద్, దిల్లీ-ఎన్‌సీఆర్‌లోనే 65% స్థలం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత మూడేళ్ల కాలంలో అద్దె లావాదేవీలతో పోలిస్తే గ్రేడ్ ఏ స్థలం లభ్యత తక్కువగా ఉందని అనరాక్ రిటైల్ సీఈఓ, ఎండీ అనుజ్ కేజ్రివాల్ తెలిపారు. 2022లో ఈ ఏడు నగరాల్లో 26 లక్షల చదరపు అడుగుల గ్రేడ్ ఏ స్థలం అందుబాటులోకి రాగా, 32 లక్షల చ.అడుగులకు గిరాకీ ఏర్పడిందని పేర్కొన్నారు. 2023లోనూ 53 లక్షల చదరపు అడుగుల స్థలం కొత్తగా రాగా, 65 లక్షల చ.అడుగుల మేర అద్దె లావాదేవీలు జరిగాయని తెలిపారు. 2024లో గ్రేడ్ ఏ మాల్ స్థలం కేవలం 11 లక్షల చ.అడుగులే అందుబాటులోకి వచ్చింది. గిరాకీ మాత్రం 65 లక్షల చ.అడుగులకు ఉందని కేజ్రివాల్ తెలిపారు. రానున్న రెండేళ్లపాటు అందుబాటులోకి రానున్న కొత్త స్థలంతో, అధిక సరఫరా అనే ఆందోళన ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు కనిపిస్తున్న అద్దె ధోరణులు భరోసా కల్పిస్తున్నాయని నివేదిక అంచనా వేసింది.
