రూ.5 వేల కోట్లు పెట్టుబడితో వస్తున్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్
ఇండియాలో ఆ సంస్ధకు మూడో ప్లాంట్
ప్రభుత్వం నుంచి ఇతోధిక ప్రోత్సాహకాలు
ఏపీ స్టేట్ బ్యూరో:
తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో మరో అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడిలో తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఎల్‌జీ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎల్‌జీ ప్లాంట్ కోసం మే 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు శ్రీసిటీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఎల్‌జీ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం కూడా పలు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిసింది. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏపీకి ఎల్‌జీ పరిశ్రమను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కృషి చేసినట్లు చెప్పుకొచ్చారు.
ఎల్‌జీ కంపెనీకి ప్రస్తుతం దేశంలో రెండే తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి పుణెలో, మరొకటి నోయిడాలో ఉంది. ఇక మూడో తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఎల్‌జీ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. మూడో ప్లాంట్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఏపీలోని శ్రీసిటీని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. శ్రీసిటీలో ఏర్పాటయ్యే ఎల్‌జీ తయారీ ప్లాంట్‌లో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, కంప్రెషర్లు వంటి కంజ్యూమర్ ఎలక్ర్టానిక్స్ తయారు చేయనున్నారు. ప్లాంట్ ఏర్పాటైన రెండు నుంచి మూడేళ్ల తర్వాత వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు సమాచారం.
