తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఇకనుంచి ఫాస్టాగ్(FASTag) తప్పనిసరని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్పష్టం చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ కొత్త విధానాన్ని విధిగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకొనే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలందించడం దృష్ట్యా ఆగస్టు 15 నుంచి తిరుమల వచ్చే వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసినట్లు పేర్కొంది. ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేస్తూ TTD ఓ ప్రకటన విడుదల చేసింది.
ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీసీఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తితిదే తెలిపింది. ఫాస్టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలోనే ఫాస్టాగ్ సౌకర్యం పొందాక మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తామని తితిదే స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తితిదేకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
