‘జీవితం ఏమవుతుందో అనే అభద్రతాభావంతో ఉండే కంటే.. నేను సాధించగలనని మైండ్ సెట్ చేసుకుని ఎక్కువ దృష్టి పెట్టాలి. నేను అక్కడే సఫలీకృతుడిని అయ్యా’ అని ప్రముఖ సినీనటుడు చిరంజీవి చెప్పారు. ‘వ్యక్తిత్వం, ప్రవర్తన, మంచితనం.. అనేవి అదనపు ఆకర్షణలు. అత్యున్నత స్థానానికి వెళ్లినా నడత సరిగా లేకుంటే గుర్తింపు ఉండదు. మైండ్ సెట్‌కు షిప్ట్ అనేది చాలాచాలా అవసరం’ అని సూచించారు. చంద్రబాబు ధీరోదాత్తుడని.. అలిపిరి దాడి ఘటనలో పడిలేచిన ఆయనలో ఎంతో మానసిక స్థైర్యం చూశానని కొనియాడారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన ‘మైండ్ సెట్ షిప్ట్’ పుస్తకావిష్కరణ సభకు హాజరైన చిరంజీవి.. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు.
‘జీవితం పూలపాన్పు కాదు. ప్రతిచోటా ఆటంకాలు వస్తుంటాయి. అయినా విజయం అందుకోలేక తప్పెక్కడ? అనుకుంటాం. మన ప్రయాణంలో ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. డిస్ట్రక్షన్ (విధ్వంసాలు), డిజప్పాయింట్‌మెంట్ (నిరుత్సాహం) వస్తుంటాయి. మిమ్మల్ని డీ మోటివేట్ (నిరుత్సాహ పరచడం) చేసే వాళ్లుంటారు. ఇలాంటి ఎన్ని ‘డి’లు ఉన్నా.. వాటిని ‘ఢీ’కొట్టాలంటే డిటర్మినేషన్ (చిత్తశుద్ధి) ఎంతో ముఖ్యం. ఎక్కడా బెదరకూడదు.
గానుగెద్దు జీవితం కాదు..
చాలామందికి మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు. గురువులు చెప్పడం లేదు. ఒకేలా కష్టపడుతూ గానుగెద్దులా జీవితం వెళ్లదీస్తారు. ఏదో సమయంలో పదవీ విరమణ చేస్తారు. ఈ జన్మకు ఇది చాలు అనుకుంటూ జీవితం చాలిస్తారు. అది సరైంది కాదు. ఆలోచన విధానం మార్చుకుని.. కష్టపడే మనస్తత్వంతో ఇష్టమైన ప్రొఫెషన్‌లో ఉంటే ఒక స్థాయిలో రాణించవచ్చు.
గొప్ప అందగాడివా అన్నారు
చదువుకునే సమయంలో డ్రామా వేస్తే అవార్డులొచ్చాయి. ప్రయత్నిస్తే సినిమా రంగంలో ఒక స్థాయిలో ఉండొచ్చనిపించింది. అదే మాట ఎవరితో అన్నా.. ‘సినిమా రంగం తక్కువ అనుకుంటున్నావా? తెలిసిన వారున్నారా? నువ్వేమైనా గొప్ప అందగాడివా?’ అన్నారు. కానీ పట్టుదలతో పగలంతా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ, ఐసీడబ్ల్యూఏఐ రాత్రి కళాశాలలో చదువు. క్రమంగా సినిమా అవకాశాలు వచ్చాయి. నన్ను నేను ఉత్తమంగా నిరూపించుకుంటూ ప్రయాణం సాగించా. హీరోగా ఎదిగే సమయంలో కొందరు నిర్మాతలు.. తక్కువ స్థాయి రౌడీ వేషాలు వేయమని నన్ను అడిగారు.
చట్టానికి కళ్లులేవు లాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే.. నన్ను చిన్న చిన్న రౌడీ వేషాలు వేయమంటున్నారేంటి? అనుకునేవాడిని.. కానీ లోపల ఒకటే ధైర్యం.. ఎన్ని వేషాలు వేసినా కచ్చితంగా అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉండేది. అదే నన్ను నిలబెట్టింది. నేను చిన్న చిన్న విలన్ పాత్ర వేసినా అందులో మెరిసి అందర్నీ ఆకర్షించేలా చేసుకునేవాడిని.. మన ఊరి పాండవుల్లో మిగిలిన వారి కంటే నాకు పెద్ద పాత్ర లేదు. ఉన్న కొంచెం సేపే చమక్‌లా మెరిశాను. అలా నన్ను నేను అలా ఆవిష్కరించుకున్నా.
చంద్రబాబు ధీరోదాత్తుడు..
అలిపిరి సంఘటనతో చంద్రబాబు కిందపడి లేచారు. అంతటి పరిస్థితిలోనూ ఎక్కడా చెక్కు చెదరలేదు. ఎంతో మానసిక స్థైర్యంతో ఉన్నారు. అంతటి ధీరోదాత్తత చంద్రబాబులో చూశాను. ప్రతికూల పరిస్థితులు వచ్చినా.. వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ముందుకు వెళ్లాలి. అందుకు నిదర్శనమే చంద్రబాబు. ఆయన తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగంలో రాణించాలనే తపించారు.
కాలేజీ రోజుల నుంచి నాయకత్వ లక్షణాలతో.. ఎదిగారు. రాష్ట్రానికి సేవ చేయాలనే దీక్షతో నడిచారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఎదిగారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందింది. ఈరోజు ఐటీ, డిజిటలైజేషన్, ఏఐ స్థాయికి చేరడానికి.. మార్గదర్శకుడు చంద్రబాబు’ అని చిరంజీవి అన్నారు.
