రెండు సార్లు నిర్మాణ సంస్ధలకు గడువు కాలం పొడగింపు
బందరు దశను మార్చే ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వ అలక్ష్యం
ప్రతీసారీ ఎన్నికల హామీగా మిగిలిపోతున్న బందరు రేవు, హార్బర్
ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేని పరిస్ధితి

ఏపీ స్టేట్ బ్యూరో,
బందరు పోర్టు, హార్బర్ నిర్మాణ పనులు వేగంగా సాగడంలేదు. ఏపీలో కొత్తగా ఇతర ప్రాంతాల్లో ప్రారంభమైన పోర్టు, హార్బర్ల పనులు వేగంగా జరుగుతుంటే, ఇక్కడి పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. పనులు పొందిన నిర్మాణ సంస్ధలు ప్రభుత్వం నుంచి రెండుసార్లు గడువు కాలాన్ని పొడగింపునకు అనుమతి పొందాయి. అయితే ఆ తేదీల్లోనూ పనులు పూర్తికావని స్ధానికులు చెబుతున్నారు. ఈ రెండు నిర్మాణాలు పూర్తి అయితే బందరు పరిస్ధితి మారుతుందని అక్కడి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఆశలకు భిన్నంగా అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇది ఇప్పటి నుంచి కాదని, ప్రతీ ఎన్నికలకు బందరు ఓడరేవు, హార్బర్ల నిర్మాణాలు రాజకీయ నాయకులకు హామీలుగా మిగులుతున్నాయే కానీ పనులు పూర్తి కావడం లేదంటున్నారు.
మచిలీపట్నంకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వారేనని, ఆయన మత్స్యకారుల అభ్యున్నతికి దోహదపడే ఈ రెండింటిని పూర్తి చేయడానికి గట్టిగా పని చేస్తారని అక్కడి ప్రజలు భావించారు. అయితే మంత్రికి కేటాయించిన శాఖల బాధ్యతలను పూర్తి చేయడానికే ఆయనకు సమయం ఉండటం లేదని, అందువల్లనే పోర్టు నిర్మాణ పనులపై పెద్దగా సమయాన్ని కేటాయించ లేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద బందరు దిశ మారడానికి అవకాశం ఉన్న ఈ రెండు ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు.

కృష్ణా జిల్లాలో కీలక అభివృద్ది ప్రాజెక్టులైన బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని కాంట్రాక్టు సంస్ధలు తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా, ఆచరణలో నత్తనడకన సాగుతున్నాయి. 49 నెలల్లో ఒప్పంద గడువును రెండుసార్లు పెంచినా ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు 69 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మరో ఐదు నెలల్లో ఒప్పంద గడువు ముగుస్తున్నా పోర్టు నిర్మాణ పనులు 33 శాతం మాత్రమే జరిగాయి. నిర్మాణాలు సంక్లిష్టంగా మారడంతోనే ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని కాంట్రాక్టు సంస్థలు వంకలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఏడాదిలో రెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఏ మేరకు ఆచరణకు వస్తాయన్నది చర్చనీయాంశమైంది. రూ.421.17 కోట్ల బందరు ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎపి మారిటైం బోర్డుతో హైదరాబాద్‌కు చెందిన ఎంఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. పది మీటర్ల పొడవైన 300 పడవలు, 15 మీటర్ల పొడవైన 200 పడవలు, 24 మీటర్ల పొడవైన టూనా లాంగ్ లైనర్ 50 పడవలు ఈ హార్బర్‌లో ఉంచేందుకు వీలుగా నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకు అవసరమైన జట్టీలు, వేట పడవలపై వెళ్లే మత్య్సకారులు, వారి వద్ద ఉండే వేట పరికరాలు, బోట్ల రిపేరు, మత్య్ససంపద వేలం గొడౌన్లు వంటికి ఈ ప్రాజెక్టు పూర్తయితే మత్స్యకారులకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం వంద పడవల ద్వారా రూ.20 కోట్ల విలువైన మత్స్య సంపద అందుబాటులోకి వస్తుండగా, ఆధునిక హార్బర్ పూర్తయితే సంపద ఉత్పత్తి రూ.200 కోట్లకు పెరుగుతుందని చెప్తున్నారు. 3,300 మంది మత్య్సకారులకు ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. కాంట్రాక్టు సంస్థ ఒప్పందం ప్రకారం 2021 మార్చి 18న పనులు ప్రారంభించి 2023 మార్చి 3 నాటికి 24 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. తర్వాత 2024 సెప్టెంబర్ 17 వరకు 19 నెలలు గడువు పొడిగించారు. ఇప్పటికి రూ.270 కోట్ల విలువైన 64.12 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నార్త్ బ్రేక్ వాటర్ 1150 మీటర్లు, సౌత్ బ్రేక్ వాటర్ 1240 మీటర్ల వద్ద బండరాళ్లు ఎన్ని వేసినా ఊబిలోకి వెళ్లిపోతున్నాయి. ఈ డిజైన్‌లో మార్పులకు ఐఐటి చెన్నైకు కాంట్రాక్టు సంస్థ ఇంజనీర్లు నివేదిక పంపారు. ఆయా ప్రాంతాల్లో బ్రేక్ వాటర్ మినహాయింపు డిజైన్ల కోసొ చెన్నై ఐఐటి ఆమోదం రాగానే మిగిలిన రూ.151.17 కోట్ల విలువైన 35.88 శాతం పనులు పూర్తికి మరోసారి ప్రభుత్వం గడువు పొడించాల్సి ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
పోర్టు నిర్మాణం ఇలా…

బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే అనుబంధంగా వందలాది పరిశ్రమలు ఏర్పాటవుతాయని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం ఊరిస్తోంది. 2023 మేలో ఈ పోర్టులో మొదటి దశలో నాలుగు బెర్త్‌ల నిర్మాణాన్ని మెగా ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్ సంస్ధ మొదలెట్టింది. 30 నెలల్లో అంటే 2025 అక్టోబర్ నెలాఖరుకు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. రూ.3,669 కోట్ల విలువైన వర్కులకుగానూ 25 నెలల్లో రూ.1200 కోట్ల విలువైన 32.72 శాతం పనులను మాత్రమే పూర్తయ్యాయి. 67.28 శాతం పనులు చేయాల్సి ఉంది. దేశంలోని పోర్టుల్లోనూ 40 నుంచి 45 మీటర్ల లోతు నుంచి బేర్త్ ఫైల్స్ (పిల్లర్లు) నిర్మించారని, బందరు పోర్టు నిర్మాణ ప్రాంతంలో బురద మట్టి ఎక్కువ లోతు ఉండడంతో 60 మీటర్ల లోతు నుంచి వాటిని ఏర్పాటు చేయాల్సి రావడంతో ఆలస్యం అవుతోందని, దీనికి తోడు చెన్నైకు చెందిన రైట్స్ కన్సల్టెన్సీ డిజైన్లు రూపకల్పనలో ఆలస్యం చేయడం ఒక సమస్యగా మారిందని కాంట్రాక్టు సంస్థ చెబుతోంది.
పూర్తయ్యేదెప్పుడో?
