ఏపీ స్టేట్ బ్యూరో,
రౌడీ షీటర్లను కొడితే తప్పేంటి అని హోమ్ మంత్రి అనిత అన్నారు. గంజాయి అమ్మకాలను చేపడుతున్న నిందితుల అరికాళ్లపై తెనాలి పోలీసులు కొట్టడాన్ని మొదటి గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం సమర్ధించుకున్నది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది రాష్ట్రమంతా చర్చనీయాంశం అయింది. పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడి చేయడం వల్లే తాము వాళ్లను పట్టుకుని శిక్షించినట్లు పోలీసులు చెప్పుకొస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తున్న తరుణంలో సోమవారం హోంమంత్రి స్పందించారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారని, ఒక స్టెప్ ఫార్వాడ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తారని చెప్పుకొచ్చారు. పోలీసుల్ని కొంత పని చేసుకోనివ్వాలన్నారు.
తెనాలిలో పోలీసులపై రౌడీ షీటర్స్ దాడికి ప్రయత్నించారని, పోలీసుల్ని కొట్టినందుకే వాళ్లు అలా చేసారని హోంమంత్రి తెలిపారు. వాళ్లందరూ రౌడీ షీటర్స్, గంజాయి బ్యాచ్ అని అన్నారు. పోలీసుల్ని కొట్టిన వాళ్లను చట్టప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా ఇలా రోడ్డుపై లాఠీలతో అందరూ చూస్తుండగా కొట్టడం, దాన్ని హోంమంత్రి సమర్ధించుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి చర్యలను సమర్ధిస్తే పోలీసులు మరింత రెచ్చిపోతారన్న చర్చ జరుగుతోంది.
