నిన్నటి విధ్వంసం నుంచి..రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభమయ్యే రోజు..రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు. మే 2న రాజధానిలో ప్రధాని మోదీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లిలోని నివాసంలో ఆదివారం సాయంత్రం సమీక్షించారు. ‘ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైకాపా ప్రభుత్వం విధ్వంసం చేసింది. నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి.. ఒక అద్భుత రాజధానిని నిర్మించి, విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నాం’ అని స్పష్టం చేశారు. ‘గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు దాడులు చేసింది. అయితే అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల అభిలాషకు అనుగుణంగా ప్రారంభమైన అమరావతి.. వాటన్నింటినీ తట్టుకుని నిలబడింది. గత ప్రభుత్వ విధ్వంసం కారణంగా ఎదురైన సవాళ్లను.. కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పరిష్కరించి.. నిలిచిపోయిన పనుల్ని పట్టాలెక్కిస్తున్నాం’ అని సీఎం వివరించారు.
