ఏపీ స్టేట్ బ్యూరో,
నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పుల నమోదుకు బుధవారం నుండి అవకాశం కల్పిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్న వారిని తొలగించండం, కార్డులను సరెండర్ చేయడం వంటి వాటిని గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకుంటారని తెలిపారు. వారం రోజుల తరువాత వాట్సాప్ గవర్నెన్సు ద్వారా ఈ సేవలను నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నామని తెలిపారు. జూన్ మాసంలో స్మార్టు కార్డుల రూపంలో నూతన రైస్ కార్డుల జారీకి సన్నాహలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల ద్వారా దాదాపు 4,24,59,028 మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు మరియు 80 సంవత్సరాలు పైబడిన వారికి ఇకెవైసి చేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు కల్పించడం తో దాదాపు 6,45,765 మందికి ఇకెవైసి చేయడం జరగలేదన్నారు. అదే విధంగా ఇప్పటికే 3,94,08,070 మంది తమ రైస్ కార్డులో మార్పులు చేర్పుల కోసం నమోదు చేసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.
