ఏపీ స్టేట్ బ్యూరో,
రాష్ట్ర పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకర్షించేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించేందుకు వార్షిక, త్రైమాసిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందింస్తుంది. ప్రత్యేకించి టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్, నైట్ సఫారీ, డాల్ఫిన్ షోలు, 150 అరకు కాఫీ స్టాల్స్, ఎక్స్ పీరియన్స్ సెంటర్స్ ఏర్పాటు వంటి పలు ప్రణాళికలు తయారు చేస్తుంది. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల్లో అక్కడి ప్రాముఖ్యతను బట్టి కార్యక్రమాలు చేపట్టనున్నది. ప్రతి నెలా పర్యాటక ప్రగతికి సంబంధించిన నివేదికలు రూపొదించనున్నది. ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు అన్ని జిల్లాల్లో పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నది. ఈ విషయమై కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి డీపీఆర్ లు రూపొందిస్తారు. తద్వారా వాటిని అమలు చేసి రాష్ట్రానికి పర్యాటక శోభ తీసుకువచ్చేందుకు కృషి జరుగుతుంది. విభిన్న పర్యాటక ప్రక్రియలను ప్రవేశపెట్టి పర్యాటకుడికి మధురానుభూతి కల్పించనున్నది.
కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులతో పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి త్వరితగతిన అనుమతులు, రాయితీలు అందించి ప్రాజెక్టులు త్వరగా పట్టాలెక్కేలా చర్యలు ప్రారంభించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. భవానీ ఐల్యాండ్, హోప్ ఐల్యాండ్ సహా రాష్ట్రంలోని ఐల్యాండ్‌లన్నింటినీ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
అంతేగాక రాష్ట్రంలో అరకు, గండికోట సహా 6 ప్రాంతాల్లో 180 టెంట్‌లతో టెంట్ సిటీస్ ఏర్పాటు చేసే చర్యలు ప్రారంభించామన్నారు. రాజమండ్రి, విజయవాడ, బెరంపార్క్, సూర్యలంకలో పర్యాటకుల కోసం త్వరలోనే హౌస్ బోట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి చెందిన హోటళ్లు, రిసార్టులను అప్‌గ్రేడ్ చేయడమేగాక కొత్తగా మరికొన్ని హోటళ్లు, రిసార్టులను అభివృద్ధి చేయనున్నామన్నారు. పర్యాటక రంగాన్ని ఆకట్టుకునేలా మెగా ఈవెంట్స్, నేషనల్ ఫెయిర్స్,ఇంటర్నేషనల్ ఫెయిర్స్ నిర్వహిస్తున్నామన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో రోప్‌వేల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన, వారసత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కి పైగా హోమ్ స్టేలు గుర్తించామన్నారు. దేవాలయాల్లో అధ్యాత్మిక పర్యాటక అభివృద్ధిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
