జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఖండించారు. ఈసందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్‌ల మధ్య కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవ జరుగుతోందన్నారు. అయితే, దాన్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని తెలిపారు.
రోమ్ పర్యటనకు బయల్దేరిన ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా భారత్-పాక్ (India-Pakistan) ఉద్రిక్తతలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఆ రెండు దేశాలు నాకు చాలా దగ్గర. కశ్మీర్ విషయంలో భారత్, పాక్‌ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక, తాజాగా పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgram Terror Attack) చెత్త పని. ముష్కరుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. అయితే, ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చినవారు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెంట్ ఫోర్స్’ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రికత్తలు భగ్గుమన్నాయి.
