సంయుక్తా (Samyuktha) తెలుగు, హిందీ, తమిళం అని తేడాల్లేకుండా అన్ని భాషల్ని చుట్టేస్తోంది. వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. అయితే ఇప్పుడామె ఖాతాలో మరో పాన్ ఇండియా సినిమా చేరింది. తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi).. దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సీనియర్ నటి టబు ఓ ప్రధాన పాత్రధారిగా కనిపించనుంది. ఇప్పుడీ బృందంలోకి సంయుక్తా కూడా చేరింది. ఆమె ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలియజేస్తూ చిత్ర వర్గాలు మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటనని విడుదల చేశాయి.
‘‘ఆమె నడకలో హుందాతనం.. కళ్లలో ఆగ్రహం’’ అంటూ తన ఫొటోను పంచుకున్నాయి. ఇదొక పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానుంది. విజయ్ ఇందులో మునుపెన్నడూ చేయని విభిన్న పాత్రలో.. సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘భిక్షాందేహి’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సంయుక్త ప్రస్తుతం తెలుగులో ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2), ‘స్వయం భూ’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో లారెన్స్‌తో ‘బెంజ్’లో సందడి చేయనుంది. హిందీ, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తోంది.
