కార్మిక చట్టంలో సవరణ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసమేనట
* స్పష్టం చేసిన మంత్రి పార్థసారథి
M.GANESH. VIJAYAWADA.
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు పది గంటలు పని చేయాల్సి ఉంటుంది. వీరి కోసం కార్మిక చట్టాల్లో భారీ మార్పులు చేపట్టింది. సవరించిన ఆంధ్రప్రదేశ్ ఫ్యాకరీల చట్టం ప్రకారం ఇప్పటి వరకు 9 గంటలు పని చేసిన ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
కార్మిక చట్టంలోని సెక్షన్ 54లో మార్పులు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 8 గంటలు పని చేయడానికి పరిమితి ఉండేది. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెట్టుబడులు భారీగా ఆకర్షిం చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటి. మాన్ పవర్ అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పని గంటలు కూడా 10 గంటలు చేస్తే పరిశ్రమలు వచ్చేందుకు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పదేళ్ల క్రితం 8 గంటలుగా ఉన్న వర్కింగ్ అవర్స్ ను 9 గంటలకు పెంచారు. ఇప్పుడు సెక్షన్ 54 కింద మార్పులు చేర్పులు చేసి 10 గంటలు చేశారు. దీనితో పాటు సెక్షన్ 55 లో కూడా సవరణలు చేశారు. మొదట ఐదు గంటల పని తర్వాత అరగంట విరామం తప్పనిసరిగా ఉండేది. దీన్ని ఇప్పుడు ఆరు గంటల పని తర్వాత ఒక గంట విరామంగా మార్చారు.
ఓవర్ టైం గరిష్ట పరిమితిలో కూడా మార్పు
ఓవర్ టైం గరిష్ట పరిమితిలో కూడా మార్పులు చేశారు. మొదట ఇది 75 గంటలు ఉండగా, ఇప్పుడు 144 గంటలకు పెంచారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రి కె. పార్థసారథి మాట్లాడుతూ.. ఈ మార్పులు ప్రభుత్వ “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంలో భాగమని అన్నారు. నిబంధనలను కొద్దిగా సడలించడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ పెట్టుబడులు వస్తాయని, వ్యాపారం చేయడం సులభం అవుతుందని ఆయన అన్నారు. అయితే పని గంటలు పెంచడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. ఇది తమ ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై పెను ప్రభావం చూపుతుందని అంటున్నారు.
