అన్ని గ్రామాలలో పీఎండీఎస్ అమలు చేయండి
ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అమలులో లేని గ్రామాలలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం అమలు చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు . బుదవారం రాష్ట్రంలోని 26 జిల్లాలలో ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2025-26 సంవత్సరంలో 15.40 లక్షల రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి మార్చాలనే లక్ష్యంతో ప్రయత్నాలు మొదలు పెట్టామని చెప్పారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడమే కాకుండా, దాని వెనక ఉన్న శాస్త్రాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని విస్తృతంగా అమలు చేయడం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను నెలకొల్పడం అవసరమని అయన స్పష్టం చేశారు.

రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ కుమార్ మాట్లాడుతూ రసాయనాలు వాడడం వల్ల మనం తినే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోతున్నాయని చెప్పారు. వ్యవసాయం వల్ల ఆర్థిక బారం పెరుగుతుందని, ప్రకృతి వ్యవసాయం భూమి ఆరోగ్యానికి, రైతు శ్రేయస్సుకు అవవసరమని అయన తెలిపారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీ రావు మాట్లాడుతూ అధికారులందరూ ప్రకృతి వ్యవసాయం వెనుక ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకొనేందుకు సంసిద్ధులై ఉండాలని సూచించారు. ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ హర్టీకల్చర్ పంటలలో అధిక ఉత్పత్తులు సాధించడంలో ప్రకృతి వ్యవసాయం ఎంతగానో సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు. రైతు సాధికార సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి బి రామారావు, సలహాదారులు డాక్టర్ డీవీ రాయుడు తదితరులు ప్రసంగించారు.
