ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కార్యాచరణ,
ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు.
16 చోట్ల 1036 బస్సుల తనిఖీలు – 236 బస్సులకు జరిమానాలు.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేసారు.
ప్రత్యేక తనిఖీలు ప్రారంభం
సరైన పత్రాలు లేని మోటార్ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్డు, హైవేస్, అగ్ని మాపకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి తనిఖీలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
16 పాయింట్లలో కట్టుదిట్టమైన తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా టోల్‌ప్లాజాలు, వివిధ చెక్‌పోస్టులు చింతూరు పోలీస్ స్టేషన్, పలమనేరు, నరహరిపేట, జిలుగుమిల్లి, కత్తిపూడి, పుల్లూరు టోల్ ప్లాజా, సున్నిపెంట, చిలకల్లు టోల్ ప్లాజా, బడవ టోల్ ప్లాజా, సాగర్ టోల్ ప్లాజా, దాచేపల్లి టోల్ ప్లాజా, శ్రీ కాళహస్తి టోల్గేట్, సూళ్లూరుపేట టోల్గేట్, కొడికొండ, పురుషోత్తపురం, సాలూరు బైపాస్ మొత్తం 16 పాయింట్లలో తనిఖీలు జరిగాయన్నారు.
1036 బస్సుల పరిశీలన
గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1036 బస్సులను తనిఖీ చేపట్టి, ఉల్లంఘనలు గుర్తించిన 236 బస్సులపై కేసులు నమోదు చేసి, పలమనేరులో 2 బస్సులను సీజ్ చేసి, నగదు జరిమానాలు విధించమని మంత్రి తెలిపారు.
భద్రతపై కఠిన చర్యలు
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణ కోసం కఠిన చర్యలు అమలు చేస్తామని ఇకనుండి విధిగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
