వినియోగదారులు ముందుగా నగదు మొత్తాన్ని రీఛార్జి చేయించుకోవాలి.
ఏపీ స్టేట్ బ్యూరో,
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుకు చాలా వ్యత్యాసం ఉంది. పూర్తిస్ధాయి అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డు హోల్డర్లు కొనుగోళ్లు చేసే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా కొంత మంది కార్డు హోల్డర్లు నెలవారీ బిల్లులను సకాలం చెల్లించలేకపోతున్నారు. లేదా బిల్లు మొత్తాన్ని వాయిదాల్లో చెల్లిస్తుంటారు. డెబిట్ కార్డు ఇందుకు విరుద్దం. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత వరకు ఉంటే అంతే మొత్తాలను కొనుగోలు చేస్తుంటారు. వీరు జాగ్రత్తగా కొనుగోళ్లు చేస్తుంటారు. నగదు వృధా కూడా కాదు. అదే విధంగా కూటమి ప్రభుత్వం ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్టు మీటర్ల బిగించేందుకు ఆదేశాలు జారీ చేసింది.
తొలి దశలో నలభై ఒక్క లక్షల ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్ల బిగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దశల వారీగా రెండు కోట్ల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం భావిస్తుంది. తొలి దశలో సీపీడీసీఎల్ పరిధిలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని ముఖ్య నగరాలలో 10.28 లక్షల ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయించారు.
*ప్రీపెయిడ్ పద్ధతిలో…*
సెల్ ఫోన్ తరహాలో రీఛార్జ్ చేయించుకోవాలి. అందుకు అనుగుణంగానే విద్యుత్ సరఫరా అవుతుంది. రీచార్జి చేయించుకున్న మొత్తం అయిపోతే, విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. వినియోగదారులు దీనిని బట్టి ఎప్పటికప్పుడు స్మార్ట్ మీటర్లలో రీ ఛార్జి చేయించుకోవాల్సి ఉంది. వినియోగదారులు తాను రీఛార్జి చేయించుకున్న మొత్తానికి అనువుగా విద్యుత్ వాడుకుంటారు. ఫలితంగా విద్యుత్ వాడకం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
