బందరులో సినీ హీరోల సందడి …
మసులా బీచ్ ఫెస్టివల్ విజయవంతం కోరుతూ 2కే రన్ …
ఏపీ స్టేట్ బ్యూరో,
కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో సినీ హీరోలు సందడి చేశారు. ఈనెల 5 నుంచి 8 వరకు జరుగనున్న మసులా బీచ్ ఫెస్టివల్స్ విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం మచిలీపట్నంలో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా భైరవం సినిమా హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్ హాజరయ్యారు. మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు ఈ రన్ కొనసాగింది . హీరోలతో పాటు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎస్పీ గంగాధర్ తదితరులు ఈ 2కే రన్ లో పాల్గొన్నారు. ప్రాచీన చరిత్ర గల మచిలీపట్నంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని హీరో మంచు మనోజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో పురాతన కట్టడాలు నిర్మాణాలు వున్నాయని ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు ఈ ప్రాంతానికి వెన్నుముక అన్నారు.

ఈ పోర్టు పునర్నిర్మాణానికి కృషిచేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు . హీరో నారా రోహిత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కొత్త అభివృద్ధిని చవిచూస్తుందన్నారు. దానిలో భాగంగానే పర్యాటక రంగాన్ని ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందన్నారు. మచిలీపట్నం ప్రాంతంలోని మంగినపూడి బీచ్ లో జరిగే మసులా బీచ్ ఫెస్టివల్స్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మచిలీపట్నం అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర అభినందనీయులు అన్నారు. హీరోలు పాలుపంచుకున్న ఈ 2కే రన్ ఆద్యంతం సందడిగా కొనసాగింది .ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర డాన్స్ చేయటం హైలైట్ అయింది.
