కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna).. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబోలో ఓ చిత్రం రూపొందనున్నట్లు స్పష్టత వచ్చేసింది. ‘వీరసింహారెడ్డి’ విజయం తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేయనున్న రెండో సినిమా ఇది. దీనిపై దర్శకుడు గోపీచంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇది పూర్తిగా యాక్షన్ చిత్రంగా ముస్తాబు కానుందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న దీన్ని ప్రారంభించనున్నామని ఆయన ప్రకటించారు. దీంతో ‘అఖండ 2: తాండవం’ (Akhanda) పూర్తయిన వెంటనే బాలయ్య ఈ సినిమా కోసమే రంగంలోకి దిగనున్నట్లు స్పష్టత వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్‌ను మరో నిర్మాణ సంస్థతో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మించనుంది..
దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవలే ‘జాట్’తో (Jaat) బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘జాట్ 2’ని కూడా ప్రకటించారు. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు గోపీచంద్ తెలిపారు. ఈ రెండో భాగంలో సన్నీ దేవోల్ పాత్ర కుటుంబ నేపథ్యాన్ని చూపించనున్నామని.. దీంట్లో ‘జాట్’లో కంటే ఎక్కువ యాక్షన్, ఎమోషన్, కామెడీ ఉంటాయని వివరించారు.
