భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. చీకటి పొరలు చీల్చుకొని సూర్యుడు పొద్దుపొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది. ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది.
ఈ రెండు చోట్లా ఒక్కో క్యాంపులో 25-30 మంది మృతులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిల్లో మర్కజ్ తొయిబా మదర్సా అత్యంత కీలకమైంది. దీనిని లష్కరే తొయిబా ప్రధాన కార్యాలయంగా వాడుతుంటారు. ఇక బవహల్పూర్‌లోని ఉస్మాన్ ఓ అలి క్యాంప్ జైషే ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. వాస్తవానికి దీనిని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకుంది.. కానీ, నాడు చివర్లో వదిలేసింది. ఈసారి మాత్రం దానిని నేలమట్టం చేసింది.
ఇప్పటివరకు తొమ్మిది స్థావరాల్లో 80 మంది వరకు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పాక్‌కు జరిగిన నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తోంది.
