భారత్.. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియా విజయవంతంగా ధ్వంసం చేసింది. శతృదేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకధాటిగా మిస్సెళ్లను సంధించింది. తెల్లవారు జామున 2 గంటల సమయంలో చీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సెల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి.
ఈ దాడులు జరగగానే ఇండియాకు మద్దతు ప్రకటించిన తొలి దేశం ఇజ్రాయెల్. పాకిస్తాన్ పై యుద్ధంలో భారత్ కు అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. భారత దేశానికి పూర్తి సహాయ, సహకారాలను అందిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ తెలిపారు.
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని వ్యాఖ్యానించారు. భారత్ చేపట్టిన మిస్సెళ్ల దాడిని ఆత్మరక్షణ హక్కుగా అభివర్ణించారు రువెన్ అజర్. ఈ సైనిక చర్యను అన్ని రకాలుగా ఇజ్రాయెల్ సమర్ధిస్తుందని తేల్చి చెప్పారు. దాక్కోవడానికి తమకు ఎక్కడా చోటు లేదనే విషయాన్ని ఉగ్రవాదులు గ్రహించాల్సిన అవసరం ఉందని అన్నారు..
