ఏరువాకకు శ్రీకారం
ఏపీ ఎనాలిసిస్, చాట్రాయి.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో జిల్లాలో రూ. 3.05 కోట్లతో 875 మంది రైతులకు వ్యవసాయ అధునిక పరికరాలు అందించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. బుధవారం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో నాగలితో పొలం దున్ని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఏడాది పొడవునా అన్నదాతలకు సిరులు పండేలా చేయాలని కోరుతూ, ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు అవసరమైన యంత్రపరికరాలు, డ్రోన్లు అందించడం జరుగుతున్నదన్నారు. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేయడంలో భాగంగా ఈనెల 20 వతేదీన రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక పరిస్ధితులు అనుకూలించనప్పటికీ రైతులకు మేలుచేసే కార్యక్రమంలో మాత్రం ఎటువంటి రాజీపడేది లేదన్నారు.
