మహా మార్పు…
లోకేష్ కు పార్టీ పగ్గాలు …
కడప మహానాడులో నిర్ణయం ….
రేపటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ …
కె.వి. కృష్ణారావు, జర్నలిస్టు .
తెలుగుదేశం పార్టీ మహానాడు ఈసారి మహా మార్పుకు వేదిక కానుంది. ఆ పార్టీ యువనేత నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారు. కడపలో జరిగే మహానాడులో ఈ మేరకు నిర్ణయం జరగనుంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు కడపలో మహానాడు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. స్వల్ప ఆటంకాలను ఎదుర్కొని సమీకరణకు పెద్ద ఎత్తున సన్నాహాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ఈసారి రాయలసీమ వేదిక అయింది .ఇంతకుముందు ఒంగోలు రాజమండ్రి లో టిడిపి మహానాడు నిర్వహించగా ఇప్పుడు కడప గడపలోకి మహానాడు అడుగుపెట్టింది .
కరోనా అనంతరం 2022లో ఒంగోలులో మహానాడు నిర్వహించారు. తదుపరి 2023లో రాజమండ్రిలో ఈ కార్యక్రమం జరగ్గా 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది మహానాడు వాయిదా పడింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా ఈ ఏడాది మహానాడు నిర్వహణ కు కడపను సిద్ధం చేశారు. కడపలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మహానాడు ను విజయవంతం చేయడానికి పార్టీ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేసింది .ఈ మహానాడు నిర్వహణ కోసం 19 కమిటీలు ఏర్పాటు చేశారు. ఆహ్వాన కమిటీ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు తెలంగాణ నుంచి పోలిక బ్యూరో సభ్యులు బక్కని నరసింహాలకు చోటు దక్కింది. మిగిలిన 18 కమిటీలలో రాష్ట్ర మంత్రులు పోలిట్ బ్యూరో సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. వీరంతా గత వారం రోజుల నుంచి మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఏర్పాట్లు సోమవారం సాయంత్రానికి పూర్తి కాగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి మహానాడుకు తరలివచ్చేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి ప్రజలు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని ప్రాంతాల నుంచి సోమవారం సాయంత్రం నుంచి బయలుదేరిన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మంగళవారం ఉదయం నాటికి కడప చేరనున్నారు. వీరికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వసతి తోపాటు బస, భోజనాలు ,అల్పాహారం తాగునీరు వగైరా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
మహా బెడద …..
*******
టిడిపి మహానాడుకు కరోనా మహా బెడదగా తయారైంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో కడపలో మహానాడు నిర్వహణ కు కొంతమేర ఆటంకాలు ఎదురయ్యాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు వాయిదావేయాలని కోరుతూ స్థానిక వైసీపీ నాయకులు ఆ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష కుమార్ ఏకంగా దీనిపై కోర్టులోనే వేశారు. లక్షలాదిగా జనం ఒకే చోట గుమిగూడడంతో కరోనా విస్తృతికి దోహద పడుతుందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి టిడిపి సంసిద్ధమయింది. ఇదిలా ఉండగా ఈ నెల 21న కోవిడ్ పై అన్ని జిల్లాల్లో చర్యలు తీసుకోవాలని ఆ చర్యలు కఠినంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓ సర్కులర్ జారీ అయింది. కడప లో మహానాడు నిర్వహణ నేపథ్యంలో ఆ సర్కులర్ ను సవరిస్తూ సోమవారం మరో సర్కిల్ జారీ చేశారు. ఈనెల 21న జారీ చేసిన కరోనా సర్కులర్ కఠిన చర్యలను సూచిస్తుండగా సోమవారం విడుదలైన సర్కులర్ అందుకు భిన్నంగా ఉండడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .ఏదేమైనప్పటికీ కరోనా నియమాలు పాటిస్తూ మహానాడు సజావుగా నిర్వహించేందుకు మాస్కులు,శానిటైజర్ సిద్ధం చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మహానాడును నిర్వహించాలనే తలంపుతో పార్టీ కనిపిస్తోంది.
మహా మార్పు….
కడప మహానాడులో తెలుగుదేశం పార్టీలో మహా మార్పు చోటు చేసుకోనుంది. యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారు .ఈ మేరకు ఈ మహనాడులో తీర్మానం జరగనుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహించి ఆయా జిల్లాల నుంచి తీర్మానాలు సేకరించడం జరిగింది. వాటిలో ప్రధానంగా అన్ని జిల్లాల నుంచి నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయం వ్యక్తమయింది. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాలు అన్ని నారా లోకేష్ ఆధ్వర్యంలోని జరుగుతాయి .చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి పరిమితం అవుతారు.
పార్టీ అభీష్టం మేరకే ఈ నిర్ణయం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. 70వ దశకంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్నారు. ఈయన 19 95లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా తదుపరి 1999 లో ఆ తర్వాత 2014లో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 2024 లో నాలుగో సారి రాష్ట్ర ముఖ్యమంత్రి గా పగ్గాలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్ర పరిస్థితులు క్లిష్టమైనప్పుడు వాటిని పరిష్కరించే బాధ్యతను భుజాలపై వేసుకొని చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు .1983 లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు నాయకత్వంలో అధికారంలోకి రాగా ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో ఏర్పడ్డ సంక్షోభం నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీని గట్టెక్కించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రతిభను స్వయంగా చూసిన ఎన్టీ రామారావు చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఆయన 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కుప్పం నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు. అప్పటినుంచి ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్తావన కొనసాగుతుంది. ఆ తర్వాత 1995లో లక్ష్మీపార్వతి రూపంలో ఏర్పడ్డ సంక్షోభం నుంచి పార్టీని కాపాడి ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు నాటి నుంచి నేటి వరకు పార్టీని సింగిల్ హ్యాండ్ తో నడుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2014లో ఏర్పడ్డ రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రదేశ్ విడిపోగా కొత్తగా ఏర్పడ్డ నవ్యాంధ్ర కోసం ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చేశారు .2019లో పార్టీ ఓటమూ పాలు కాగా 2024 లో తిరిగి తెలుగుదేశానికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో కడపలో జరుగుతున్న ఆ పార్టీ మహానాడు ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది.
