బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి…సెలబ్రిటీ గా సొంతూరొచ్చా…
కష్టానికి మించిన సాధన ఏదీ లేదు….
అందుకు నిదర్శనమే పాన్ ఇండియాతో 400 కోట్లతో సినిమా….
ఈ బీచ్ పెస్ట్ తో మంత్రి రవీంద్ర బందరును ఎక్కడికో తీసుకుపోయారు …
మసులా బీచ్ ఫెస్టివల్స్ లో మనసు విప్పి మాట్లాడిన యువ డైరెక్టర్ మారుతి…
(కె వి కృష్ణారావు – జర్నలిస్టు)
బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి మసులా బీచ్ ఫెస్టివల్ కు వచ్చానని ప్రముఖ యువ డైరెక్టర్ మారుతి అన్నారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం (మంగినపూడి) లో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్స్ కు శనివారం రాత్రి డైరెక్టర్ మారుతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి కష్టమే తనను నేడు సెలబ్రిటీ గా చేసిందన్నారు .సెలబ్రిటీగా సొంతూరు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చదువుకునే రోజుల్లో సినిమా హాలు ముందు తోపుడు బండిపై నాన్న అరటిపళ్ళు అమ్మేవాడిని ఆ బండి వద్ద నుంచే తనలో ఏదో తెలియని ఆసక్తి మొదలైందన్నారు. తర్వాత ఇదే బందర్లో స్టిక్కరింగ్ షాప్ నిర్వహించానని అలాంటి కష్టాలను ఎదుర్కొని నేడు సినీ రంగంలో నిలదొక్కుకుని సెలబ్రిటీగా మీ ముందుకు రావడం చెప్పరానంత ఆనందంగా ఉందన్నారు. కష్టానికి మించిన సాధన ఏదీ లేదన్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ తో 400 కోట్ల రూపాయలతో సినిమా చేయడమే అందుకు నిదర్శనం అన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ నెల 16న జరుగుతుందన్నారు .హీరో ప్రభాస్ అభిమానుల అంచనాలకు మించి ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందన్నారు. మసులా బీచ్ ఫెస్టివల్స్ తో బందరు ఖ్యాతి నలుదిశలా వ్యాపిస్తుందన్నారు .ఇందుకు కృషి చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర అభినందనీయులన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బందరు అభివృద్ధి కోసం శక్తివంచ లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడమే తన ధ్యేయమన్నారు.

