ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో పాటు శాఖాధిపతులు.. ఈ నెల 21, 22, 23 తేదీల్లో పల్లె బాట పడుతున్నారు. స్థానిక సచివాలయంలో కానీ, అంగన్‌వాడీ కేంద్రం/పాఠశాల భవనంలో కానీ రెండు రాత్రులు నిద్ర చేస్తారు. మూడు పగళ్లు అక్కడే ఉంటారు. ప్రజల సాధకబాధకాలు తెలుసుకుంటారు. సివిల్ సర్వీసు అధికారులంతా పల్లె నిద్ర చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా.. ప్రణాళిక శాఖ ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమానికి ‘స్వర్ణాంధ్ర సంకల్పం’ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముసాయిదా మార్గదర్శకాల్ని రూపొందించారు. వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి.. ఆయన సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. కార్యక్రమ అమలుకు సంబంధించి త్వరలో అధికారులకు కార్యశాల నిర్వహించనున్నారు.
పల్లెలకు వెళ్లే అధికారులు రాజకీయ నేతలకు దూరంగా ఉండాలి. వారి ఇళ్లకు వెళ్లకూడదు. ఉక్కపోతగా ఉందనో, దోమలు కుడుతున్నాయనో.. రాత్రి సమయాల్లో నేతల ఇళ్లలో బస చేయకూడదు. మొదటి రాత్రి ఎక్కడ నిద్రించాలి, రెండో రాత్రి ఎక్కడ నిద్రించాలో ప్రభుత్వమే సూచిస్తుంది. అక్కడే బస చేసి.. స్థానికులతో మాట్లాడాలి.
స్వర్ణాంధ్ర సంకల్పం కార్యక్రమానికి సివిల్ సర్వీసు అధికారులను మాత్రమే పంపాలని తొలుత అనుకున్నారు. సెలవుల్లో ఉన్న వారిని మినహాయిస్తే.. రాష్ట్రంలో ఐఏఎస్‌లు 150 మంది, ఐపీఎస్‌లు 90 మంది, ఐఎఫ్‌ఎస్‌లు 50 మంది కలిపి 290 మంది ఉంటారు. వీరితో పాటు శాఖాధిపతుల్ని కూడా కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని తర్వాత నిర్ణయించారు. వీరు సుమారు 100 మంది వరకు ఉంటారు. అంటే దాదాపు 400 మంది వరకు పల్లెనిద్రకు వెళ్లే అవకాశం ఉంది. ఎవరు ఎక్కడికి వెళ్లాలి? అనేదానిపై ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సారథ్యంలోని ఉన్నతాధికారుల కమిటీ కసరత్తు చేస్తోంది.
ప్రభుత్వ పథకాలెలా అందుతున్నాయి?: ప్రభుత్వ పథకాల అమలుపైనా అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలుసుకుంటారు. పథకాలు ఎలా అందుతున్నాయి? వాటి అమలులో సాధక బాధకాలేమిటి? ఇంకా ఏమైనా కోరుకుంటున్నారా? ప్రజల అవసరాలేమిటి? పథకాల్లో మార్పులు చేయాలా? అని వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. పొదుపు సంఘాలు, నీటి సంఘాలు, పాఠశాల కమిటీలతోనూ చర్చిస్తారు.
