ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు
ఏపీ స్టేట్ బ్యూరో.
షేక్ కాలేషా ఐడియా అతని జీవితాన్ని మార్చేస్తుంది. సాధారణ టైలర్లగా ఆయన ఆలోచించలేదు. ఎక్కడైనా దుకాణం తీసుకుంటే దానికి అడ్వాన్స్, నెలవారీ అద్దె, కరెంట్ బిల్లుతోపాటు ఇతర ఖర్చులను భరించడం అతనికి కష్టంగా మారింది. టైలరింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఆ ఖర్చులకే పరిపోవడం లేదు. దీనితో కొత్తగా ఆలోచించాడు. ఇంటి వద్దకే టైలరింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాడు. వెంటనే ఖాతాదారుల పనిని చేసేస్తున్నాడు. అదేమిటో చూడండి మరి..
కృష్ణాజిల్లా పెనమలూరు మండలం వణుకూరుకు చెందిన షేక్ కాలేషా టైలర్ వృతితో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తొలుత గ్రామంలో టైలరింగ్ దుకాణాన్నినిర్వహించేవాడు. అయితే, కాలక్రమేణ షాపుకు ఆదరణ తగ్గిపోయింది. కొంత మంది బట్టలు కుట్టించుకున్నా ఇచ్చే మొత్తం కంటే, అప్పులు పెట్టేదే ఎక్కువైంది. దీంతో కుటుంబ జీవనం కష్టంగా మారింది. వేరే పని వెత్తుకుందామా అంటే.. తెలిసింది టైలరింగ్ పని ఒక్కటే. టైలరింగ్ వృత్తి ద్వారానే ఏదో విధంగా ఆదాయం పెంచుకోవాలని భావించాడు. ఈ క్రమంలో మొబైల్ టైలరింగ్ ద్వారా ఉపాధి పొందాలనుకున్నాడు.
ఈ ఆలోచనలో భాగంగా తొలుత ఓ రిక్షాను కొని దానికి కుట్టుమిషన్ను అనుసంధానించాడు. ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేశారు. గ్రామంలో కాలనీల్లో తిరుగుతూ ఇంటి వద్దే పాత, చిరిగిన బట్టలు కుట్టడం ప్రారంభించాడు. ఈ సేవలకు మంచి ఆదరణ లభించటంతో.. టీవీఎస్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి పొరుగూళ్లకు తన సేవలను విస్తరించుకున్నాడు. రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ ఉపాధి పొందుతున్నాడు. ప్రస్తుతం అవసరం ఉన్న వాళ్లు కాలేషాకు ఫోన్ చేసి మరీ పిలిపించుకుని బట్టలు కుట్టించుకుంటున్నారు. షాపు నిర్వహించటం కన్నా మొబైల్ టైలరింగ్ సేవలతోనే లాభాం ఉందని కాలేషా చెబుతున్నాడు.
