స్వాతంత్ర్యానికి పూర్వమే అ.. ఆ ..లు నేర్పిన పాఠశాల... ఎందరినో ఉన్నతంగా తీర్చి దిద్దిన బడి... ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలకు వేదిక... చదువు స్నేహం జత చేసిన ఒడి..మోదుమూడి బడి..
అదే కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడి పాఠశాల. ఈ పాఠశాలకు వందేళ్లు వచ్చాయి.
విద్యాశాఖ ఆధారాలను బట్టి ఈ పాఠశాల 1925లో ఏర్పడగా ఇప్పటికి వందేళ్ళు వచ్చాయి. ఈ సందర్భంగా ఈ పాఠశాల శత జయంతి వేడుకలకు ముస్తాబవుతోంది.ఈనెల 4న ఆదివారం ఉదయం 8 గంటలకు శత వసంతాల వేడుక పాఠశాల ప్రాంగణంలో జరగనుంది . ఈ పాఠశాలలో పనిచేసిన పలువురు ఉపాధ్యాయులు నడుం కట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈనెల 4వ తేదీ ఆదివారం జరిగే శతాబ్ది మహోత్సవ సభకు ముఖ్య అతిథులుగా అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి హాజరుకానున్నారు. అవనిగడ్డ మండల విద్యాశాఖ అధికారి ఎన్ శివశంకరరావు అధ్యక్షతన జరిగే ఈ సభలో ఎంపీపీ తుంగల సుమతీదేవి జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ మోదుమూడి గ్రామ సర్పంచ్ బచ్చు బేబీ ఎంపిటిసి సభ్యులు కటికల వసంత కుమార్ అవనిగడ్డ ఎండిఓ ఎం మరియ దేవి తహాసిల్దార్ కె నాగమల్లేశ్వరరావు మోదుమూడి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బచ్చు అమర్నాథ్ ఎస్ఎంసి చైర్మన్ గాజుల ద్వారకి తదితరులు హాజరుకానున్నారు.
కాగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఈనెల మూడో తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్వ హించనున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సదస్సు జరగనుంది. ఈ శత వసంతాల వేడుక నిర్వహణ కోసం గ్రామానికి చెందిన 29 మందితో నిర్వహణ కమిటీ ఏర్పాటు చేశారు . అవనిగడ్డకు మూడు కిలోమీటర్ల దూరంలో వున్న మోదుమూడి గుంటూరు జిల్లా రేపల్లెకు పది కిలోమీటర్లు కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం కు 40 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 4256 మంది జనాభా ఉండగా ఈ గ్రామం 1376 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది .ఈ శత వసంత వేడుకల్లో పాల్గొనేందుకు గ్రామం యావత్తు సిద్ధమవుతుండగా అలాగే దూర ప్రాంతాల్లో వున్న పూర్వ విద్యార్థులు పూర్వ ఉపాధ్యాయులు హాజరై పాలు పంచుకోవడానికి ఎంతో ఉత్సుకత చూపుతున్నారు. మోదుమూడి గ్రామం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి వుండగా ఈ గ్రామం నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, విద్య, ఉద్యోగ ఉన్నతలు ఎంతోమంది వున్నారు. వారందరి సమ్మేళనమే ఈ వందేళ్ళ శత వసంతాల వేడుక కానుంది .
Post Views: 33