
ఈ ఏడాది ఆరంభంలో ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలతో ఈ లోహాల మెరుపులు తగ్గుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు (Gold, Silver Rates) భారీగా క్షీణించాయి.
సోమవారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ (Gold) ఔన్సు ధర 4,377.95 డాలర్లకు దిగొచ్చి నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. స్పాట్ గోల్డ్ ధర తగ్గడం వరుసగా ఇది తొమ్మిదో రోజు కావడం గమనార్హం. గత వారం ఆరంభంలో ఈ పసిడి ధర 5000 డాలర్ల పైన పలికింది. అటు వెండి (Silver) ధర 65.74 డాలర్లకు పతనమైంది. ఇక, దేశీయంగానూ ఈ లోహాలకు గిరాకీ తగ్గింది. ఏప్రిల్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో 10 గ్రాముల బంగారం ధర నేడు 4.59శాతం తగ్గి రూ.1,37,862 వద్ద కొనసాగుతోంది. మే ఫ్యూచర్స్‌లో వెండి ధర 5.70శాతం పతనమై కేజీ ధర రూ.2.13లక్షలుగా ట్రేడ్ అవుతోంది.