రాజధానికి కూతవేటులో మావోయిస్టులు
విజయవాడలో 24, ఏలూరులో 15 మంది మావోస్టుల అరెస్టు
మావోయిస్టుల కోసం జల్లెడ
స్ధానిక పోలీసుల డొల్లతనం- నిఘా సంస్ధల వైఫల్యం.
రాజధానికి కూతవేటు దూరంలో మావోయిస్టుల దొరకడంపై ఆందోళన
వివిఐపీలు ఉండే రాజధానిలో పోలీసుల భద్రత కూడా అధికమే.
అయినా మవోస్టులు ఇక్కడే తలదాచుకోవడంపై కలవరం
ఎం.గణేశ్, జర్నలిస్టు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్, తరుచూ వచ్చే కేంద్ర మంత్రులతో విజయవాడ ఇప్పుడు కీలక ప్రాంతంగా మారింది. వీవీఐపిలు నడయాడే ప్రాంతంలోనూ, రాజధాని అమరావతికి కూతవేటులో 24 మంది మావోయస్టులను పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకుని ఎన్నో నేరాలకు సంబంధించిన ఆధారాలను కనుగొంటున్న ప్రస్తుత పరిస్ధితి లో ఒకే భవనంలో 24 మంది మావోస్టులను పోలీసులు గుర్తించకపోవడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడే కాకుండా ప్రశాంతంగా ఉండే ఏలూరులో 15 మంది మావోస్టులు దొరకడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని మావోస్టుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. 
మునుపెన్నడూ లేని రీతిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, విజయవాడలోని కానూరులో అధిక సంఖ్యలో మావోస్టులు పట్టుబడ్డారు.మన మధ్య ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎలా ఉన్నారు, వారికి ఆశ్రయం ఎవరు ఇఛ్చారనే అంశంపై స్ధానికులు తర్జన భర్జన పడుతున్నారు. ఇదే సమయంలో స్ధానిక పోలీసులు, నిఘా సంస్ధల వైఫల్యాన్ని ప్రజలు ఎండగడుతున్నారు. రాత్రి పూట సినిమాకో. లేక ఇతర ఊళ్ల నుంచి వచ్చేవారిని పట్టుకుని వంద ప్రశ్నలతో వేధింపులకు గురి చేసే స్ధానిక పోలీసులకు వీరెవరూ కనపడలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక నిఘా విభాగాలకు చెందిన సిబ్బంది పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో పట్టుబడిన ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ రెండు ప్రాంతాల్లోని మావోయిస్టులను పట్టుకున్నారే కాని స్వయంగా విచారించి పట్టుకోక పోవడం కేవలం వారి డొల్లతనానికి నిదర్శంగా చెబుతున్నారు. 
మంగళవారం ఉదయాన్నే భారీగా పోలీసులు కానూరు తరలిరావడంతో స్థానికులు టెన్షన్ పడ్డారు. ఇటీవల మారేడుమిల్లిలో జరిగిన మావోయిస్టు ఎన్ కౌంటరులో కీలకమైన డైరీ ని పోలీసులు గుర్తించారు. ఈ డైరీలో లభ్యమైన అనేక విషయాలను నిశితంగా పరిశీలించిన పోలీసులు విజయవాడలోని కానూరులో మావోయిస్టులు తలదాచుకున్నట్లు గుర్తించారు. ఈ సమాచారం స్థానికంగా
కలకలం రేపింది. నగరం నడిబొడ్డున కానూరు కొత్త ఆటోనగర్ లో ఓ భవనంలో సుమారు 27 మంది మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచి పోలీసుల వలపన్నారు.. సమాచారం అందుకున్న వెంటనే కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలోని పోలీసులు అక్టోబస్, గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టులు తలదాచుకున్న ఇంటితో పాటు కానూరు చుట్టు పక్కల ప్రాంతాలను చుట్టుముట్టాయి. ఈ మావోల ముఠాకు ఒక మహిళ నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. ఆ మహిళ నేతృత్వంలో కానూరులో తలదాచుకున్నట్లు చెబుతున్నారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో లభ్యమైన డెయిరీలో ఉన్న సమాచారంతో పోలీసులు వెనువెంటనే అప్రమత్తమై కానూరులో భవనాన్ని గుర్తించారు. ఆ భవనంలో అనుమానాస్పదంగా ఉన్న 27 మందిని గుర్తించారు. వీరిలో 21 మంది మహిళలు కాగా, 6 గురు పురుషులు ఉన్నారు. వీరంతా చత్తీస్ ఘడ్ నుంచి షెల్టర్ కోసం విజయవాడ వచ్చినట్లు భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తుండటంతో మావోయిస్టులు అడవులను వదిలేసి ప్రాణ రక్షణ కోసం షెల్టర్ల జోన్లలో తలదాచుకుంటున్నారు. అయితే ఇలా వచ్చిన వారు విజయవాడను ఎంచుకోవడంపైనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతి పక్కనే ఉన్న విజయవాడలో వీవీఐపీ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. నిత్యం పోలీసు నిఘా కొనసాగుతుంది. అలాంటి చోట మావోయిస్టులు తలదాచుకోవడమే చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ప్రాంతం సురక్షితమైన జోనుగా మావోలు ఎందుకు ఎంచుకున్నారు అనే విషయమై పోలీస్ ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

మారేడుమిల్లి ఎన్ కౌంటరుతో మావోయిస్టులు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వచ్చినట్టు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మావోయిస్టుల జాడ లేదు. పోలీసులు కూడా మావోయిస్టులు అలికిడి ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. మారేడుమిల్లిలో అగ్రనేత మద్వి హిడ్మా మరణించగా, ఎదురుకాల్పుల జరగిన చోట లభ్యమైన సమాచారంతో విజయవాడలో షెల్టర్ లో ఉన్న వారి సమాచారం లభ్యమైంది. దీనితో మావోలు కదలిక ఉన్న ప్రాంతాలలో మరోసారి పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఏలూరులో 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆధ్వర్యంలో ఏలూరు శివారులోని గ్రీన్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ భవనంలో 15 మంది మావోయిస్టులను స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒడిశాకు చెందిన వీరంతా గత వారం రోజులుగా గ్రీన్‌సిటీలో తలదాచుకున్నట్టు అనుమానిస్తున్నారు.
