స్టార్ డమ్..ప్రోటోకాల్ ని పక్కన పెట్టిన ఉప ముఖ్యమంత్రి
మొకాలు వరకు ఫ్యాంట్ మడత పెట్టి బురద నీటిలో రైతులతో పంట పొలాల పరిశీలన
రైతుల్ని ఆదుకుంటానని హామీ
ఎం.గణేశ్, ఏపీ స్టేట్ బ్యూరోఇన్ఛార్జి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ రీల్ హీరో కాదు. రియల్ హీరో అనే విషయాన్ని గతంలో అనేకసార్లు నిరూపించారు. గిరిజన ప్రాంతాల పర్యటనలో అక్కడి పరిస్ధితులకు అనుగుణంగా చెప్పులు లేకుండా వారితో కలిసి బురదలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం తరువాత బురద రోడ్లు తారు రోడ్లు అయ్యాయి. గిరిజన మహిళల కాళ్లకు చెప్పులు వచ్చాయి.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ ప్రజాప్రతినిధి గిరిజన ప్రాంతాల్లోని మారు మూల ప్రాంతాల్లో పర్యటించలేదు. అక్కడి సమస్యలను పట్టించుకున్నదీ లేదు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్నప్పటికీ పర్యటించారు. నిఘా సంస్ధలు అభ్యంతర వ్యక్తం చేసినా, దానిని పట్టించుకోలేదు. చెప్పులు లేకుండా తనతో పర్యటించిన గిరిజన మహిళల బాధలను స్వయంగా చూశారు. అమరావతి వచ్చిన వెంటనే రహదారి సౌకర్యం లేని ప్రాంతాలకు ఆ సౌకర్యం కల్పించారు. చెప్పులు లేని గిరిజన మహిళలకు తన సొంత నిధులతో చెప్పులు కొనుగోలు చేసి పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఓట్లు వేయడమే కాని తమ ప్రాంత శాసన సభ్యుడిని నేరుగా చూసిన దాఖలాలు ఆ ప్రాంత గిరిజనులకు కలగలేదు. అయితే స్టార్ డమ్ కలిగిన పవన్ స్టార్ ఆ ప్రాంతంలో సామాన్యుని వలే పర్యటించి అక్కడి వారిని ఆశ్చర్య పరిచారు.

ఈ తరహా సంఘటన కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం చోటుచేసుకుంది. అక్కడ గిరిజన మహిళలు, గిరిజనులు ఉంటే ఇక్కడ మొంధా తుపాను బాధితులున్నారు. నీటిలో మునిగిన వరి పంటను, ఇప్పడిప్పుడే పాలుపోసుకుంటున్న వరి గింజలను రైతులు చూపించారు. పంట చేతికి అంది రావడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని, ఇప్పటికి తామంతా ఎకరానికిరూ.20 వేలకుపైగానే ఖర్చు చేశామని ఆవే దన వ్యక్తం చేశారు. మిగిలిన ప్రజాప్రతినిధులు, మంత్రుల పర్యటనల వలే రైతులు తమ పంట పొలాల్లోని వరి పనలను గట్టుమీదుకు తీసుకువచ్చి ఉప ముఖ్యమంత్రికి చూపించారు. అయితే సమస్యను సమగ్రంగా తెలుసుకునేందుకు, నేరుగా చూసేందుకు పవన్ కళ్యాన్ తన ఫ్యాంట్ ని మోకాలు వరకు మడిచి రైతులతోపాటు పంట పొలాల్లోకి అడుగు పెట్టారు. రైతులతోపాటు బురదలో పంట పొలాలను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రితోపాటు మిగిలిన ప్రజాప్రతినిధులు తప్పని సరి పరిస్ధితుల్లో పంట పొలాల్లోకి అడుగు పెట్టి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ ఇతర అధికారులు పవన్ తోపాటు పంట పొలాల్లోకి దిగి పరిస్ధితులను పరిశీలించారు.
—-