మహానాడులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సీఎం
డిజిటల్ విధానంలో పార్టీకి విరాళాల సేకరణ
ఏపీ స్టేట్ బ్యూరో,
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడిపి మహానాడు వేడుకల్లో ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఆయన నోట్ల రద్దు గురించి మాట్లాడటంతో అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే. అయితే మరోసారి పెద్దనోట్లను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. రూ.500 కంటే ఎక్కువ విలువగల కరెన్సీ నోట్లేమీ చెలామణిలో ఉండకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. పెద్దనోట్లను రద్దుచేసి డిజిటల్ కరెన్సీని బాగా ప్రోత్సహించాలని చంద్రబాబు కేంద్రాన్ని సూచించారు. అప్పుడే నల్లధనం బైటపడుతుందని అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా టిడిపికి విరాళాలు ఇవ్వాలనుకునేవారు ఇప్పుడు ఈ డిజిటల్ విధానంలోనే ఇవ్వాలని.. తాము పారదర్శకంగా ఉంటామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు సాధారణ ప్రజలు కూడా తమ ఫోన్ల ద్వారానే విరాళాలు అందివ్వాలని చంద్రబాబు కోరారు
