- రాష్ట్రం నుండి భారీగా వలసలు
- తరలివెళ్లిన 12 లక్షల కుటుంబాలు
- విశాఖ, నెల్లూరు నుంచి అధికం
- ప్రభుత్వ సర్వేలో వెల్లడి
రాష్ట్రం నుండి లక్షలాది కుటుంబాలు వలసబాట పడుతున్నాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు మృగ్యం కావడం, పనులు దొరికినా అరకొరగానే ఉండటంతో బతకడానికి మరో మార్గం లేక అత్యధిక కుటుంబాలు రాష్ట్రాన్ని వీడుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు తేలింది. రాష్ట్రంలోనే ఇతర జిల్లాలకు వలస వెళ్లిన కుటుంబాల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. వలసవెళ్లిన వారిలో మొరుగైన జీవనం కోసం వెళ్లినవారు కూడా ఉన్నారని అధికారులు చెబు తున్నప్పటికీ, ఆ తరహా కుటుంబాల సంఖ్య నామమాత్రమే అని సమాచారం ఎక్కువ మంది ఉపాధి అవకాశాల కోసమే పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలో 1.71 కోట్ల కుటుంబాలు నివశిస్తున్నాయి.
వాటి పూర్తి వివరాలు సేకరించేందుకు, ఆయా కుటుంబాల్లో ఇతర పరిస్థితులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పి4 కార్యక్రమంలో భాగంగా కొద్ది కాలంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 1.49 కోట్లు కుటుంబాల వివరాలు సేకరించగా, అందులో దాదాపు 14 లక్షల కుటుంబాలు ఆచూకీ లభ్యం కాలేదు స్థానికులు అందించిన వివరాల మేరకు ఈ మొత్తంలో 1.77 లక్షల మంది రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, ఏకంగా 12,59,631 కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు తేలింది.

నిర్మాణ రంగం కుదేలు కావడంతో…
భారీ స్థాయిలో వలసలు ఉండటానికి ఉపాధి కొరతే కారణమని అధికారయంత్రాంగం కూడా ప్రాధమికంగా గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రంలో కొన్నేళ్లుగా నిర్మాణ రంగం కుదేలైపోయిన సంగతి తెలిసిందే. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికులతో పాటు, ఆరంగంపై ఆధారపడిన ఇతర కుటుంబాలు కూడా అనివార్యంగా వలస బాట పడుతున్నారు. ప్రధానంగా కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు ఎక్కువగా తరలిపోతున్నారని చెబుతున్నారు. ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖతో పాటు నెల్లూరు జిల్లాలో అత్యధిక వలసలు నమోదు అయ్యాయి, విశాఖ పట్నంలో 72.8 లక్షల కుటుంబాలు ఉన్నట్లు లెక్కలు చెబుతుండగా, అందులో ఇప్పుడు 1.13 లక్షల కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లినట్లు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో కూడా 8.59 లక్షల కుటుంబాలకుగాను 85 వేలకుపైగా కుటుంబాలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. కడప, తిరుపతి, పల్లాడు, ఎన్టీఆర్, కర్నూలు, కృష్ణా, కాకినాడ, గుంటూరు, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో కుటుంబాలు బతకడం కోసం వలసవెడుతున్నాయి.
రాజధాని జిల్లాల్లోనూ వలసలే
అమరావతి రాజధాని ప్రాంతంగా ఉన్న గుంటూరుతో పాటు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద సంఖ్యలో ఉన్న ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా వలసల సంఖ్య ఎక్కువగానే ఉంది. గత ఆరేళ్లుగా ఈ ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణ పనులు జరగకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో కలిపే ఏకంగా 1,50 లక్షల కుటుంబాలు వలస వెళ్లినట్లు తేలగా, అందులో ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కుటుంబాలే 1,15,729 ఉండడం గమనార్హం.
