ఉద్యోగాలు, పరిశోధనలకు విజ్ఞాన్.పెద్దపీట
విజ్ఞాన్స్ వీశాట్ నోటిఫికేషన్ విడుదల
ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు
ఏపీ ఎనాలిసిస్, గుంటూరు
యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం, పరిశోధనలకు పెద్దపీట వేయడంలాంటి సమున్నత లక్ష్యాలతో తాము ముందుకెళుతున్నామని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ 2026–27 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ ఎల్‌ఎల్‌బీ (హానర్స్), బీబీఏ ఎల్‌ఎల్‌బీ (హానర్స్), బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, ఫార్మ్–డీ అడ్మిషన్ల వీశాట్ – 2026–27 నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేపట్టనున్న వీశాట్ ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం కలదన్నారు.
మార్చి 1 నుంచి నుంచి ఏప్రిల్ 15 వరకు ప్రవేశ పరీక్ష
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డీన్ అడ్మిషన్స్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ వీశాట్ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్టణం, ఏలూరు, రాజమండ్రిలలోని అన్ని విజ్ఞాన్ సంస్థలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ డాక్టర్ దిరిశాల విజయరాము మాట్లాడుతూ తమ యూనివర్సిటీ బీటెక్ కోర్సుతోపాటుగా ఆసక్తి ఉన్న విద్యార్థులకు సమాంతరంగా సివిల్స్ కోచింగ్ కూడా ఇస్తోందని తెలిపారు.
రూ.48 కోట్లకు పైగా విలువైన ఫీజు రాయితీ
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడంలో తమ యూనివర్సిటీ ఎప్పుడూ ముందుంటుందని డైరక్టర్ అడ్మిషన్స్ ఏ. గౌరిశంకర్ రావు తెలిపారు. గతేడాది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం అన్ని కోర్సుల్లో రూ.48 కోట్లకు పైగా స్కాలర్‌షిప్స్ ఇచ్చామన్నారు.
