అదేపనిగా ఓటీటీలు చూడడం ప్రాణాల మీదకు తెస్తోంది. బెంగళూరులో గాంధార్ (14) అనే బాలుడి ఆత్మహత్యకు జపనీస్ వెబ్ సిరీస్ కారణమని పోలీసులు తేల్చడంతో దిగ్భ్రాంతి చెందడం తల్లిదండ్రుల వంతైంది. సోమవారం రాత్రి భోజనం చేసి, తమ పెంపుడుకుక్క రాకీతో కాసేపు ఆడుకున్న గాంధార్ తన గదికి వెళ్లాడు. ‘మీరు నన్ను 14 ఏళ్లు చక్కగా పెంచారు. మీతో కలిసి ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్లే సమయం ఆసన్నమైంది. మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటా’ అని ఆత్మహత్య లేఖ రాశాడు. బాగా చదువుతూ, బడిలోనూ ఎవరితో గొడవలు లేని బాలుడు.. ఇలా రాయడం పోలీసులను ఆశ్చర్యపరచింది. తాను చూసిన సిరీస్‌లోని ఒక పాత్రధారి బొమ్మను గాంధార్ తన గదిలో గోడపై గీశాడు. సిరీస్‌లో ఒక మాయాపుస్తకంలో హీరో పాత్రధారి.. చెడ్డవాళ్లు చనిపోవాలని వాళ్ల పేరు రాస్తే.. అలాగే జరుగుతుంది. నిత్యం ఆ సిరీస్ మాత్రమే చూసే గాంధార్ దాని ప్రభావంతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని గుర్తించినట్లు పోలీసులు శుక్రవారం ధ్రువీకరించారు.
