ఏపీ స్టేట్ బ్యూరో,
రాజధాని అమరావతి విస్తరణలో భాగంగా చేపట్టిన రెండోదశ పూలింగు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే సిఆర్‌డిఏ ఆధ్వర్యాన గ్రామసభలను అధికారులు పూర్తి చేస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో గ్రామాల రైతులు స్వల్ప అభ్యంతరాల నడుమ పూలింగుకు అంగీకారం తెలుపుతున్నా, తాడికొండ మండల గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అడ్డంకులూ లేకుండా భూసమీకరణ ముందుకు సాగాలంటే గతంలో అనుభవం ఉన్న అధికారులను సిఆర్‌డిఏ జిల్లాల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నతాధికారులతోపాటు 50 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల(ఎస్‌డిసి) అవసరం ఉందని, తక్షణ అవసరంగా 30 మంది కావాల్సి ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. వీరే పూలింగు సమయంలో కాంపిటెంట్ అథారిగా వ్యవహరించనున్నారు.

తొలిగా గతంలో సిఆర్‌డిఏ భూపరిపాలన విభాగం డైరెక్టర్‌గా విశేష అనుభవం ఉన్న చెన్నకేశవులును మరలా డైరెక్టర్‌గా తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సిఆర్‌డిఎలో పూలింగు ప్రక్రియకు సంబంధించి కార్యాచరణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఆయన నియామకంపై స్పష్టమైన ప్రకటన రానున్నట్లు తెలిసింది. అదే సమయంలో 2014లో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా అమరావతిలో పూలింగు ప్రక్రియను వేగంగా నడిపించిన చెరుకూరి శ్రీధర్‌ను ఈసారి గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు పూర్తయ్యాయినట్లు తెలిసింది. ప్రసుత్తం శ్రీధర్ వైఎస్‌ఆర్ కడప జిల్లా కలెక్టర్ బాధ్యతల్లో ఉన్నారు. ఆయనకు చెన్నకేశవులు భూపరిపాలన డైరెక్టర్‌గా పూర్తిగా సహకరించారు. గతంలో పనిచేసిన సామర్థ్యం, రైతులను నయానో భయానో ఒప్పించగల నేర్పు, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్‌గా చేసిన అనుభవం శ్రీధర్‌కు ఉండటంతో మరలా సిఆర్‌డిఏ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. భూ పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలన్నీ జిల్లా నుండే చేయాల్సి ఉండటంతో కలెక్టర్ బాధ్యతల్లో నియమించడం ద్వారా ప్రక్రియను వేగవంతం చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ సాధ్యంకాని పక్షంలో పట్టణాభివృద్దిశాఖ కమిషనర్‌గా నియమించొచ్చని సమాచారం. మొత్తంగా గత పూలింగు సమయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులందరినీ రెండోదశ పూలింగు ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
