ప్రజా సమస్యలపై వైసీపీ కార్యాచరణ
ఈ నెల 29న పీఏసీ సమావేశం
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా రైతులు ప్రస్తుతం ఎరువుల కొరతతో సమస్యతో సతమత మౌతున్నారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం ఫించన్లలో విధించిన కోత కారణంగా ఆ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వీటిని ఆలంబనగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లడానికి వైఎస్పార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని, అందుకు అనువుగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. అదే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని ఆయన మండిపడ్డారు. వీటిని కూడా ప్రజలకు వివరించేందుకు సమాయత్తం అవుతున్నారు. పార్టీని, కార్యకర్తలను నడిపేందుకు, వారికి సూచనలు ఇచ్చేందుకు ఇంత వరకు ప్రత్యేకంగా ఎవరికి పూర్తి అధికారాలు ఇవ్వలేదు. ఈ సమావేశంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాల కథనం. లిక్కర్ స్కామ్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పార్టీ పరంగా ఇంత వరకు స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. వాటిపై సమగ్రమైన ప్రకటలు చేయడానికి, కార్యకర్తల్లో మనోధైర్యం కలిగించేందుకు అనువుగా కార్యాచరణ చేపట్టనున్నారు
