సిఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025 కు సిద్దమౌతున్న సీఆర్డీఏ
రూ.50,000 కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించే యత్నం
పర్యాటకం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక వసతుల రంగాలకు ప్రాధాన్యం
ప్రణాళిక రూపొందించిన కమీషనర్ కన్నబాబు
ఎం.గణేశ్, జర్నలిస్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సిఆర్డిఏ) విశాఖలో రెండు రోజులపాటు జరగనున్న సిఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2025లో సుమారు రూ.50,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. ఈ పెట్టుబడులు పర్యాటకం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక వసతుల రంగాలలో ఉండనున్నాయి. అమరావతిని సుస్థిర నగరాభివృద్ధికి, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు కేంద్రంగా నిలబెట్టే దిశగా ఈ పెట్టుబడులు కీలక పాత్ర పోషించనున్నాయి.“అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు, అభివృద్ధి, సుస్థిరత, సమగ్రతకు ప్రతీక. సిఐఐ సమ్మిట్‌లో కొత్త భాగస్వామ్యాలు రూపుదిద్దుకోవడంతో రాజధాని అమరావతి ప్రాంతం దక్షిణ భారతదేశంలో ప్రముఖ పెట్టుబడుల గమ్యస్థానంగా మరింత బలపడుతుంద”ని ఏపీ సిఆర్డిఏ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.
సిఆర్డిఏ బృందం..ఈ సమ్మిట్‌లో పాల్గొనడం ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం, సింగిల్ విండో క్లియరెన్స్, ఇతర సౌకర్యాలు, పరిశ్రమల స్థాపనకు అందించే సేవలు, పరిశ్రమలతో పాటు సేవారంగాల అభివృద్ధికి అవసరమైన ప్లగ్-అండ్-ప్లే తదితర మౌలిక సదుపాయాలను అందించేందుకు సిద్ధమైంది.పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలలో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కృష్ణా నది తీర ప్రాంతంలో ప్రీమియం హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, వెల్‌నెస్ రిసార్ట్‌ల వంటి ప్రాజెక్టులకు ప్రతిపాదనలు అందుకోవడం జరిగింది. అమరావతి కేంద్రంగా హెల్త్‌కేర్ రంగంలోనూ కొత్త వైద్య విద్యాసంస్థలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, టెక్ పార్కులు వంటి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.“ భవిష్యత్తు విజన్‌తోకు అనుకూలించే స్పష్టమైన విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, వ్యాపారహిత ప్రభుత్వ దృక్పథంతో అమరావతి దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఆకర్షణ కేంద్రంగా మారుతోంది. రూ.50,000 కోట్ల మేర రానున్న పెట్టుబడులు రాష్ట్ర రాజధాని అమరావతిపై పెట్టుబడిదారుల విశ్వాసానికి ప్రతీక” అని ఏపీ సిఆర్డిఏ ప్రతినిధి తెలిపారు.ఈ పెట్టుబడులు రాబోయే ఐదేళ్లలో వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు నగర సదుపాయాలను మెరుగుపరుస్తూ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో కీలక పాత్ర పోషించనున్నాయి.
ఏపీ సిఆర్డిఏ గురించి సంక్షిప్తంగా:
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఏపీ సిఆర్డిఏ) ప్రజారాజధాని అమరావతి, అలాగే రాజధాని పరిసర ప్రాంతాల అభివృద్ధికై పని చేస్తున్నటువంటి ప్రధాన ప్రభుత్వ సంస్థ. సుస్థిర నగర రూపకల్పన, పెట్టుబడిదారులకు విస్తృత సౌకర్యాలు అందించడం, ప్రజాకేంద్రీకృత ప్రణాళిక, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ప్రపంచస్థాయి, సమగ్ర రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడం ఏపీ సిఆర్డిఏ ప్రధాన లక్ష్యం.
