సరిగ్గా 31 ఏళ్ల క్రితం మే 21న ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నవేళ సుస్మితాసేన్ (Sushmita Sen) అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. భారత్ తరఫున తొలిసారి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించారు. అందుకే తన జీవితంలో మే 21 ఎప్పటికీ ప్రత్యేకమే అంటారు నటి సుస్మిత. నేడు మరోసారి ఆ రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
‘‘ భారతదేశానికి చెందిన 18 ఏళ్ల అమ్మాయిని విశ్వానికి పరిచయం చేసిన చరిత్రాత్మక విజయం అది. ఆశకు మరింత బలాన్నిస్తూ.. ప్రేమను మరింత ముందుకునడిపిన రోజు. ప్రపంచమంతా పర్యటించడానికి జీవితంలో స్ఫూర్తినింపే ఎంతోమంది వ్యక్తులను కలిసే భాగ్యాన్ని పొందిన రోజు. ఈ విషయంలో దేవుడికి, మా అమ్మకు ఎప్పటికీ కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను. మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తొలిసారి విజయం సాధించి 31 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే గౌరవం లభించినందుకు ఎప్పటికీ గర్వంగా ఉంటాను. పెద్ద కలలు కనండి.. వాటిని సాధ్యం చేసుకునేందుకు శ్రమించండి’’ అని పేర్కొన్నారు.
