సినీ రంగంలో 50 ఏళ్ల పాటు హీరోగా కొనసాగిన వారు ఎవరూ లేరు. ప్రపంచంలో నా ఒక్కడికే అది సాధ్యం అయింది. అందుకే నన్ను చూసి నాకే గర్వం అన్నారు సినీనటుడు, హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న నేపథ్యంలో హిందూపురంలో అక్కడి టీడీపీ నాయకులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, హిందూపురం తనకు రెండో ఇల్లు అని, అభిమానులే తన బలం అని అన్నారు. పద్మభూషణ్ తనకు సరైన సమయంలోనే వచ్చిందని, తన జీవితంలో జరిగిన సంఘటనలు సినిమాల్లోని పాత్రలకు దగ్గరగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన చిత్రాల్లో నటిస్తానని బాలకృష్ణ తెలిపారు. 50 ఏళ్లుగా హీరోగా కొనసాగిన వారు ప్రపంచంలో మరొకరు లేరన్నారు. పౌరసన్మాన సభ పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య తన సతీమణి వసుంధరతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. హిందూపురం అంటే నందమూరి పురం.నేను భగవంతుడికి అభిమానులకు మధ్య సందానకర్తని. ఎందుకంటే నాకు పద్మభూషణ్ వస్తే మీరు సొంతంగా భావించి ఇలా పండగలా జరుపుకుంటున్నారు. నాన్న తర్వాత మా అన్న హరికృష్ణ, ఆ తర్వాత నన్ను మీవాడిలా మీలో ఒకడిగా మీ గుండెల్లో పెట్టుకున్నారు. నా గుండెల్లో మీరంతా సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా” అని బాలకృష్ణ అన్నారు.
