జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పరీక్షను నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ పరీక్ష చేపట్టనున్నారు. సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దీనికి మినహాయింపునిచ్చారు. పరీక్ష సమయంలో ప్రజలకు తమ మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. గట్టిగా శబ్దం లేదా వైబ్రేషన్‌తో ఇది రావచ్చు. అలర్ట్ వ్యవస్థ సమర్థతను పరీక్షించేందుకు పంపించే సందేశం ఇదని.. ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని అధికారులు వివరించారు. అత్యవసర సమయాల్లో కీలక సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ ప్రయోగాత్మక పరీక్షను నిర్వహిస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలు (వరదలు, తుపాన్లు) లేదా ఇతర అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు, అతి తక్కువ సమయంలో లక్షలాది మందికి సమాచారాన్ని చేరవేయడం. ఈ వ్యవస్థ ద్వారా నెట్‌వర్క్ జాప్యం లేకుండా నేరుగా వినియోగదారుల మొబైల్ స్క్రీన్‌పైకి హెచ్చరికలను పంపవచ్చు. ఇది కేవలం ఒక సాంకేతిక పరీక్ష మాత్రమే.
మొబైల్ నుంచి వచ్చే శబ్దాలు లేదా సందేశాలు చూసి భయపడకండి. ఈ అలర్ట్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అధునాతన హెచ్చరిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు వెల్లడించారు. కాబట్టి రేపు ఉదయం మీ ఫోన్ మోగితే అది మీ రక్షణ కోసం జరుగుతున్న పరీక్షగా భావించండి అని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

