
వాడ్డూయూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. మీ మనసులో మొదటగా ఏది మెదిలితే దానికే ప్రాధాన్యం ఇవ్వండి. మనలో చాలామందికి జీవితంలో ఏం కావాలో తెలియదు. ఆ సమయానికి ఏది అంది వస్తే దానితో సర్దుకుపోతుంటారు. ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలతో సర్దుకుపోలేక అసంతృప్తితో నలిగిపోతుంటారు. జీవితాన్ని దుఖమయం చేసుకుంటారు. అందుకే మొదట మీకేం కావాలో తెలుసుకోండి.
మీ తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యమా?
మీ కలలు నెరవేర్చుకోవడం ముఖ్యమా?
బాయ్ ఫ్రేండ్ ని ప్రేమించడం ముఖ్యమా?
మీకేం కావాలి? తేల్చుకోండి. కష్టంగా ఉందా? అయితే ఒక పేపర్ తీసుకుని మీ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో, పెళ్లి చేసుకోకపోతే ఏం జరుగుతుందో విడివిడిగా పాయింట్లుగా రాయండి. వాటిలో ఒక్కో పాయింట్‌కు 10కి ఎన్ని మార్కులిస్తారో ఇవ్వండి. మొత్తాన్ని కూడితే మీకేది మేలు చేస్తుందో మీకే తెలుస్తుంది.
ప్రేమంటే ఇలా లెక్కలు వేసుకోవడం కాదనుకోవచ్చు. కాని నిర్ణయం తీసుకోవడం కష్టమైన ప్పుడు తప్పుకాదు. ఇక మీరు ప్రేమించిన వ్యక్తి గురించి… పెళ్లికి ముందే ఇన్ని నిబంధనలు పెట్టినవాడు, ఇన్ని అనుమానాలున్నవాడు, ఇంతగా అవమానిస్తూ మాట్లాడినవాడు, పెళ్లయ్యాక మిమ్మల్ని, మీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను గౌరవిస్తాడని నమ్మకమేముంది? రెండేళ్లుగా మీ గురించి, మీ ప్రేమ గురించి తెలిసినా రెండు రోజులు మాట్లాడకపోతేనే మరెవరితోనే సంబంధం అంటగట్టేవాడితో మీరు సుఖంగా ఉండగలరా? అతను మిమ్మల్ని బాగా చూసుకుంటాడనే నమ్మకం మీకుందా? ఆలోచించండి.
ఇక ఎవరిని ఎవరూ పూర్తిగా మార్చలేరు. అది సాధ్యం కూడా కాదు. సో ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకోండి. కష్టమనిపిస్తే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్‌ను కలవడానికి సంశయించవద్దు. ప్రేమకన్నా జీవితం చాలా విలువైంది.

