వయసుపైబడే కొద్దీ జీవక్రియ మందగిస్తుంది. ఆకలి మందగిస్తుంది. జీర్ణక్రియ సరిగా ఉండదు. శక్తి క్రమేపీ క్షీణించటం ప్రారంభిస్తుంది. క్రొత్త కణాల ఉత్పత్తి వేగం తగ్గి, ఉన్న కణాలు శిథిలం కావటం వేగవంతమవుతుంది. రోగనిరోధక శక్తి మందగించటంతో అప్పటివరకు అణిగి ఉన్న వ్యాధులు, వంశపారం పర్య దీర్ఘవ్యాధులు మెల్లమెల్లగా బయటపడుతుంటాయి. ఇటువంటి పరిస్థితులలో వృద్ధులు తమ జీవనశైలిని, ఆహార నియమాలను మార్చుకోవలసి ఉంటుంది. ఆ క్రమంలో…
  • వయసు మీద పడటంతో దాహం వేయదు. అయినా క్రమం తప్పకుండా ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీరు తీసుకోవాలి. ఇందువలన పోషకాలన్నీ శరీరంలోని అన్ని భాగాలకు చేరతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా నిలకడగా ఉంచబడుతుంది.
  • త్వరగా జీర్ణమయ్యే బలవర్థకమైన ఆహారపదార్ధాలను మాత్రమే భుజించాలి.
  • ఎముకలు దృఢంగా ఉండాలి గనుక సాధారణం కన్నా ఎక్కువగా కాల్షియం అవసరమవుతుంది. ఆ కాల్షయం శరీరానికి వంట బట్టాలంటే విటమిన్-డి అవసరం. అందువలన విటమిన్-డి, కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి.
  • వృద్ధాప్యంలో రోగనిరోధకశక్తి తగ్గకుండా తగు జాగ్రత్త వహించాలి. రోగనిరోధకశక్తిని పెంచే శక్తి   జింక్లోహానికే ఉన్నది. అందువలన జింక్  ఎక్కువగా ఉండే పదార్థాలను ఎంపిక చేసి తీసుకోవాలి.
  • నాడీవ్యవస్థ సక్రమంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి విటమిన్బి-12′ అవసరం. కనుక ఆ విటమిన్ పుష్కలంగా ఉండే ఆహారం అవసరం.
  •  వీటితో బాటు మలబద్దకాన్ని నివారించే పీచుపదార్థాలతో కూడి ఆహారాన్ని, ఇంకా ఫోలిక్ఆసిడ్, విటమిన్-బి సమృద్ధిగా ఉండే ఆహారమూ కావలసి ఉంటుంది.

ఇవన్నీ పాటించడం కొంచెం కష్టమే అయినా మన ఆరోగ్యం కాబట్టి మనమే శ్రద్ధ తీసుకోవాలి. విభిన్న రంగులలో లభించే ప్రకాశవంతమైన పండ్లు, ఫలాలను ఎంచుకోవాలి. ఆహారాన్ని కొద్ది మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఒంటరితనాన్ని దూరం చేసుకుంటూ నలుగురితో కలిసి షాపింగ్ చేయటం, నలుగురితో కలిసి భోజనం చేయటం అలవాటు చేసుకోవాలి. ఇష్టమైన వినోదంతో అంటే సినిమాలు, సంగీతం, స్నేహితులతో కబుర్లు, విహారయాత్రలు మొదలైనవాటితో కాలక్షేపం చేయవచ్చు. ఈవిధంగా ఆహార విధివిధానాలతో బాటు జీవనశైలిని కూడా మార్చుకుంటే వృద్ధాప్యం కూడా ఆనందమయమవుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించవచ్చు.

Share.
Leave A Reply

Exit mobile version